--విభజన తరువాత ప్రముఖ విద్యాలయాల లోటుతో ఉన్న సీమాంధ్ర ప్రాంతం లో ఐ.ఐ.టి,ఐ.ఐ.ఎం,ఐ.ఐ.ఐ.టి,ఎన్.ఐ.టి,కేంద్రీయ
విస్వ విద్యాలయాలు, వ్యవసాయ విద్యాలయాలు రానున్న ఐదేళ్ళలో ఏర్పాటుచేసుకోవాలి.
--విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి లను కలుపుతూ మెట్రో , విశాఖపట్నం లో
మెట్రో రవాణా వ్యవస్థని అభివృద్ది చేసుకోవాలి.
--ప్రత్యేక హోదా పదేళ్ళ పాటు ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు తయారీ
రంగ కేంద్రాలుగా భాసిల్లేలా చర్యలు తీసుకోవాలి.
--ప్రజా రవాణా వ్యవస్థలను సీమాంధ్రలోని అన్ని జిల్లా కేంద్రాలలో పటిష్టం
చేయాలి. కొత్తగా నగరాల్లో నిర్మించబోయే బాహ్య వలయ రహదారులను (అవుటర్ రింగ్ రోడ్డు) , నాలుగు వరుసల రహదార్లు లేక రెండు వరుసల రహదార్లు క్రమ పద్దతిలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, పాద చారుల బాటలతో , ప్రత్యేక సైకిల్ ట్రాక్
లతో , రోడ్డుకి సమాంతరంగా రైల్ వ్యవస్థ ఎర్పాటు చేసుకోగలిగే సౌలభ్యంతో బహుళ ప్రయోజనకరంగా నిర్మించుకోవాలి.
--అన్ని జిల్లా కేంద్రాలలో బస్సుల ద్వారా త్వరిత రవాణా విధానాన్ని(బస్
ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం -బి.ఆర్.టి.యస్ ) ని అమలు చేసే విధంగా రహదారులు విస్తరించాలి.
--కొత్తగా నిర్మించే ప్రభుత్వ కార్యాలయాలను హరిత భవనాలుగా (గ్రీన్ బిల్డింగ్స్)
తీర్చిదిద్ది , ప్రైవేట్ సంస్థలు నిర్మించే హరిత భవనాలకు ప్రత్యేక రాయితీలివ్వాలి.
--ప్రభుత్వ పాలనా వ్యవహారాలు
, వివిధ శాఖల కార్యకలాపాలన్నింటిని అంతర్జాలంలో(ఆన్లైన్) లో నిర్వహించేలా వెబ్ సైట్లు
రూపొందించాలి. తద్వారా పరిపాలనలో పారదర్శకతకి(ట్రాన్స్పరెన్సీ) పెద్ద పీట
వేసినట్లవుతుంది.
--మారుమూల గ్రామాల్లో పల్లెలకు ప్రభుత్వ కార్యక్రమాలు,అభివృద్ది ఫలాలు
చేరాలంటే పరిపాలనా సౌలభ్యం కోసం సీమాంధ్రలో ప్రస్తుతమున్న జిల్లాల సంఖ్యని 13 నుండి
25 కి పెంచాలి.
--కొత్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సుస్థిరత కోసం ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ
నియోజకవర్గాల సంఖ్యను 175 నుంది 225 కి పెంచాలి.
--యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచి, ఉద్యోగాలకు సిద్దం చేసేందుకు వివిధ
పరిశ్రమల సహకారంతో సీమాంధ్ర విశ్వ విద్యాలయాల్లో ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించాలి.
--కొత్త రాష్ట్రంలో సినీ పరిశ్రమను విస్తరించేందుకు సీమాంధ్రకు చెందిన
సినీ ప్రముఖులతో చర్చించి సినీ పరిశ్రమాభివృద్దికి అవసరమైన ప్రోత్సహకాలు కల్పించాలి.
--సీమాంధ్ర వర్ధమాన క్రీడాకారులందరికి అత్యున్నతమైన క్రీడా ప్రమాణాలతో
హైదరాబాద్ లోని క్రీడా ప్రాంగణాలకు సమాన స్థాయిలో సీమాంధ్ర ప్రాంతం లో స్టేడియాలు అభివృద్ది చేసుకోవాలి. విశాఖ , విజయవాడ
క్రికెట్ స్టేడియాలలో వసతులు మెరుగుపర్చాలి. ప్రతి మండల కేంద్రంలో ఒక స్టేడియం నిర్మించాలి.
--ప్రస్తుతమున్న కేంద్ర పరిశోధన సంస్థల విస్తరణతో పాటు, వ్యవసాయ సంబంధిత
ప్రత్తి, మిరప, పొగాకు, చెరకు, మామిడి, అరటి, ఆపరాలు మరియు మత్స్య రంగాలకు చెందిన కేంద్ర
పరిశోధన సంస్థల స్థాపనకై నిరంతరం కృషి చేయాలి.
--తీరప్రాంత పోలీస్ స్టేషన్లను(మెరైన్ పోలీస్ స్టేషన్) పటిష్టపరిచి భద్రతని
కట్టు దిట్టం చేయాలి. సముద్రంలో వేటకోసం వెళ్ళే పడవలకు ఒక గుర్తిపు సంఖ్య ఇవ్వాలి.
లైట్ హౌస్ టూరిజం ని వృద్ది చేయాలి.
-- విశాఖ-చెన్నై పారిశ్రామిక మండలి (ఇండస్ట్రియల్ కారిడార్) ని కేంద్రం
పైన ఒత్తిడి పెంచి సాధించుకోవాలి.
-- బెంగళూరు-చెన్నై పారిశ్రామిక మండలిలో భాగమైన చిత్తూరు-నెల్లూరు జిల్లాలో
ఎర్పాటుకాబోయే పరిశ్రమల నుండి ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా క్రిష్ణ పట్నం పోర్ట్ కి,
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు, రైల్ రవాణా మార్గాలను మెరుగుపర్చాలి.
--సీమాంధ్రలో అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సౌకర్యాలను, ప్రభుత్వ
బడుల్లో ఉన్న మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపర్చాలి.
--సమైక్య రాష్ట్రంలో అందని ద్రాక్ష గా మిగిలిన "పరిపాలనలో 100 శాతం
తెలుగు వినియోగం" ని ప్రోత్సహించి తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకి పునర్ వైభవం
తీసుకురావాలి. తెలుగు భాషోద్ధరణకు కృషి చేసే రాష్ట్రం గా అంధ్రప్రదేశ్ మిగలాలి.
--జలయజ్ఞం లో ప్రాభించిన వివిధ ప్రాజెక్టులను ఒక ప్రణాళికా పద్దతిలో ఏవైతే
తక్కువ పెట్టుబడితో,తక్కువ సమయంలో పూర్తై ఎక్కువ లాభాన్ని సీమాంధ్ర రైతులకు కల్గిస్తాయో
పరిశీలించి వాటినే మొదట పూర్తి చేయాలి.
--గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, ఇంకుడు గుంతలు నగరాల్లో నిర్మించి,
చెక్ డ్యాములు పర్వత ప్రాంతాల్లో కట్టించి భూగర్భ జలవనరులను కాపాడుకోవాలి.
--పులిచింతల ప్రాజెక్టులో భాగంగా ఇంకా పూర్తి కాని పనులను వీలైనంత త్వరగా
పూర్తి చేసి కృష్ణా ఆయకట్టు రైతుల పైర్లకు రాబోయే రబీ నుండి సాగు నీరందించాలి.
--జవహర్ లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పధకం కింద వచ్చే నిధులతో ఎ.పి.యస్.ఆర్.టి.సి
ని పటిష్టం చేయాలి. ఆర్.టి.సి ని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
--చేనేత పరిశ్రమకి ప్రోత్సహకాలివ్వాలి. ధర్మవరాన్ని భారతదేశంలోనే ప్రఖ్యాత పట్టు చీరల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలి.
-- హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా పదేళ్ళు ప్రకటించినప్పటికీ కొత్తగా వచ్చే పార్టీ సీమాంధ్ర కార్యాలయాలతో సహా సీమాంధ్రకు అనుబంధమైన అన్ని సంస్థలు సీమాంధ్ర ప్రాంతంలోనే తమ కార్యాలయాలు నెలకొల్పి అక్కడ నుండే కార్యకలాపాలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
--సభలు, సమావేశాల నిర్వహణకు అనువుగా ఉండేందుకు అత్యాధునిక వసతులతో కూడిన కన్వెన్షన్ సెంటర్లను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లలో నిర్మించాలి.
--ఆంధ్ర ప్రదేశ్ లో వై.యస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం శంఖుస్థాపన చేసిన బి.హెచ్.ఇ.ఎల్-ఎన్.టి.పి.సి విద్యుత్ ఉపకరణాల తయారి పరిశ్రమ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ కర్మాగారాన్ని త్వరగా పూర్తి చేసేలా ఆ సంస్థలపైన ఒత్తిడి తేవాలి.
ఒక జిల్లాను వైద్య రంగంలో
అగ్రగామిగా( హెల్త్ క్యాపిటల్) , మరో జిల్లాను పరిపాలనా కేంద్రంగా (అడ్మినిస్ట్రేటివ్
క్యాపిటల్) , ఇంకో జిల్లాను విద్యాలయాలకు నెలవుగా( ఎడ్యుకేషన్ సెంటర్), ఆర్ధిక వ్యాపార
రాజధానిగా(ఫైనాన్షియల్ క్యాపిటల్) మరో జిల్లాను, రవాణా కూడలి (ట్రాన్స్పోర్టేషన్ హబ్
)గా ఇంకో జిల్లాను, హార్డ్ వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఒక చోట, వ్యవసాయ సంబంధిత
పరిశ్రమలు మరో చోట, ఫార్మా మరియు గ్యాస్ రంగాలు ఒక ప్రాంతంలో, సిమెంట్ మరియు ఖనిజ పరిశ్రమలు
మరో ప్రాంతంలో , పాలు మరియు మత్స్య ఆధారిత పరిశ్రమలు ఇంకో ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్
పరిశోధనా కార్యాలయాలు వివిధ ప్రాంతాలలో ఇలా అభివృద్దిని పంచాలి. సమతులాభివృద్దిని సాధించాలి.
సీమాంధ్ర సర్వతో ముఖాభివృద్దికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కొత్త ఆంధ్రప్రదేశ్ ని భారత
దేశంలోనే అగ్రగామిగా నిలపాలి.