Sunday, July 14, 2013

యువత చూపు లఘు చిత్రాల (Short Films) వైపు !

             యువత తామెంచుకున్న అంశానికి కొంత సృజనాత్మకత, మరి కొన్ని ఆలోచనలను జోడించి అద్భుతమైన నేపద్య సంగీతంతో , చక్కటి సంభాషణలతో తమకి నచ్చినట్లుగా, మనందరం మెచ్చే విధంగా రూపొందించిన తక్కువ నిడివి గల చిత్రాలే ఈ లఘు చిత్రాలు (Short Films). 5, 10 మహా ఐతే 25 నిమిషాలు ఉండే ఈ పొట్టి చిత్రాలు యువత ఆలోచనలను బయట ప్రపంచానికి దృశ్య రూపంలో ఆవిష్కరించటానికి ఉపకరిస్తున్న అందమైన సాధనాలు. నేటి ధోరణికి అనుగుణంగా, వర్తమాన అంశాలు , సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగానే వీటిని తెరకెక్కిస్తున్నారు.

       ప్రియురాలి ప్రేమ కోసం ప్రియుడు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు, కాలేజి రోజుల్లో జరిగిన హాస్య సంఘటనలు, ప్రేమే జీవితం కాదంటూ హిత బోధలు, టి.వి చానెళ్ళలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలకు ఇంకా ప్రకటనలకు అనుకరణలు, ప్రముఖ సినిమాల్లో సన్నివేశాలకు పేరడీలు, సినిమా విడుదల అనంతర విశ్లేషణలు (Movie Reviews), రాజకీయ పార్టీల కుప్పిగంతులు, మాటలే లేని మూకీ చిత్రాలు  ఇలా అంశం ఏదైనా తాము తీసే లఘు చిత్రం మిగతా వాటి కంటే వైవిధ్యంగా, హాస్య భరితంగా, నెటిజెన్ లలో తమను
ప్రత్యేకంగా నిలపాలని నేటి యువత నిరంతరం తపిస్తున్నారు...దానికి తగ్గట్లుగా కష్టపడుతున్నారు కూడా.

        యువత లఘు చిత్రాల బాట పట్టడానికి ఎన్నో కారణాలున్నాయి. వీటిల్లో నటించే నటీనటులకు అనుభవం ఉండాల్సిన అక్కర్లేదు. సినీ రంగంలో లా ప్రముఖుల కొడుకులు, కూతుర్లుగా పుట్టాలనే అర్హత ఉండదు. లోకేషన్ల కోసం విదేశాలు  తిరగవల్సిన పని లేదు. అంతా కొత్తే. దర్శకుడు కొత్త, నటిస్తున్న తారాగణం కొత్త వారు, సాంకేతిక నిపుణులు, గాయకులు ఇలా అంతా యువ రక్తమే. అందరికీ తొలి ప్రయత్నమే. మన చుట్టూ ఉండే పరిసరాల్లో అత్యాధునిక కెమెరాతో షూటింగ్ తీసి కొంచెం శ్రద్ధగా ఎడిట్ చేస్తే చాలు. తయారైన లఘు చిత్రాన్ని యూ ట్యూబ్ లో ఎక్కిస్తే (Upload) సరిపోతుంది. అందుకే ఒకప్పుడు నగరాలకు పరిమితమైన లఘు చిత్రాల నిర్మాణ సంస్కృతి దేశం నలుమూలలా పాకిపొయింది. విద్యార్ధులు, స్నేహితుల బృందాలు, ఉద్యోగులు , ప్రవాసాంధ్రులు, మారు మూల పల్లెల్లో యువకులు ఇలా ఎంతో మంది తమ అభిరుచికి తగ్గట్లుగా లఘు చిత్రాలు నిర్మించి అందులో నటిస్తూ తమ వాణి వినిపిస్తున్నారు.

        ఈ పొట్టి చిత్రాలను ప్రపంచంలో ఎక్కడివారైనా చుసే విధంగా ప్రదర్శించే థియేటర్ పేరు యూ ట్యూబ్. అంతర్జాలం (Internet) వినియోగించేవారిలో యూ ట్యూబ్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే యూ ట్యుబ్ లేకపొతే ఇంతమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చేవారే కాదు. లఘు చిత్రాల నిర్మాతలకు, నటీనటులకు, సంభాషణా రచయితలకు, గాయకులకు రాత్రికి రాత్రే ఆదరణ పెంచేసి సినిమా అవకాశాలను సైతం అందించేలా చేసే కల్ప వృక్షం, ధన లక్ష్మి ఈ యూ ట్యుబ్. ఎంతమంది ఈ లఘు చిత్రాలను యూ ట్యూబ్ లో వీక్షిస్తే నిర్మాతలకు అన్ని డబ్బులు.

         అందుకే లఘు చిత్రాల నిర్మాణాన్ని ఉపాధిగా ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. లఘు చిత్రాలకు ఆదరణ ఏ స్థాయిలో ఉందంటే తమ రాబోవు లఘు చిత్రాలకు లఘు ప్రచార చిత్రాలు (Trailers of Short Films), ప్రచార గీతాలు (Promo songs) ( అంటే మన సినిమాకి ప్రచార చిత్రం(trailer) ఎలానో అలా అన్నమాట) విడుదల చేసి మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నారు. భాషా బేధాలు లేకుండా అందరికి చేరువయ్యేందుకు  ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ వేస్తున్నారు. ఎం.ఆర్. క్రియేషన్స్ , సినిమా పిచ్చ వంటివి ఈ కోవలోనివే.     ఇదంతా చూస్తుంటే మీక్కూడా ప్రయత్నించాలని ఉంది కదా! ప్రయత్నించండి మరి.  ఆల్ ది బెస్ట్.  

         నాకు నచ్చిన లఘు చిత్రాలలో కొన్ని మీ కోసం ఇక్కడ ఉంచాను. చూసి ఆనందించండి.  

India in Modi Rule 2014-24

Translate