Sunday, December 7, 2014

ఆమె నోట ప్రతి పాట ' చిత్ర 'మే!

         



              ఆమె పాటకు ప్రకృతి కూడా పరవశిస్తుంది ఇక మనిషి సంగతి కొత్తగా చెప్పాలా! మనిషి మనసుకి హాయి కలిగించే మంత్రమేదో వేస్తుంది తన పాట. కదలకుండా కూర్చున్నవారిని కూడా తక్షణం నాట్యమాడేలా ఊరిస్తుంది ఆ పాట. సరస, భక్తి, విరహ, చిలిపి, కొంటె, ప్రేమ, విషాద, మనోహర, ఆరాధన, సౌందర్య భావమేదైనా స్పష్టంగా పలికించగలదు ఆమె పాట. ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టినప్పటికీ ఆ పాటల ప్రవాహం తెలుగు నేలను పులకింపజేస్తూనే ఉంది. ఆమె పేరే చిత్ర. 

              చిత్ర పేరు వినని తెలుగు గాయనీ గాయకులు, తెలుగు పాటల ప్రేమికులు ఉండకపోవడం విచిత్రమే. తెలుగే కాదు, అన్ని దక్షిణాది భాషల్లో, హిందీ చిత్ర సీమలోను చిత్ర సుపరిచితురాలు. చిత్ర పాడితే ఆ పాటలో తెలుగుదనం తొణికిసలాడుతుంది. కల్లో ల మనసున్న వారు ఆహ్లాదభరితంగా అవ్వాలంటే ఔషదం ఆమె పాటే!  అదే సంగీతాన్ని అస్వాదించే మనసైతే మళ్ళీ మళ్ళీ వినాలని మారం చేస్తూ వ్యసనానికి లోనవుతుంది. తెలుగు పాటల పూతోటలో విరిసిన సిరి మల్లె చెట్టు చిత్ర పాట.  

             "తెలుసునా తెలుసునా" అంటు చెలికాడిపై ప్రేమను వ్యక్తం చేసినా, వర్షాన్ని " నువ్వొస్తానంటే నేనొద్దంటానా" అని పలకరించినా , ప్రియుడు కొట్టిన చెంప దెబ్బని "అబ్బనీ తియ్యనీ దెబ్బ" అని పొగిడినా, మనసు ఆనందభరితమైన వేళ "ఆనందమానందమాయె"  అని ఆలపించినా, " ఉలికి పడకు అల్లరి మొగుడా " అంటూ ఆట పట్టించినా , గోపాలున్ని ప్రస్తుతించినా, ఆ నంద గోపాలుడి గోపికలను "చాలును లేమ్మా నీ నిదుర" అని నిద్ర లేపినా, పెరటి జాంచెట్ల పండ్లని కుశలం అడిగినా, "మౌనంగానే ఎదగమనీ" నీతి వాక్యాలు చెప్పినా ఆ గాత్ర సౌందర్యమే సౌందర్యము. 
                              ఇక మన తెలుగులో బాల సుబ్రమణ్యం, చిత్ర పాటల జంట సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. వాళ్ళిద్దరూ  కలిసి గానం చేసిన పాటలు వింటే బీడు భూమికి కూడా సిరులు పండించే సత్తా వచ్చినట్లుగా మనసు ఆనందంతో పునరుత్తేజితమవుతుంది, ఉబ్బి తబ్బిబవుతుంది.  

              ఇటివల మా టి.వి నిర్వహిస్తున్న సూపర్ సింగర్ కార్యక్రమానికి చిత్ర గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వర్ధమాన తెలుగు గాయనీ గాయకులకు ఎన్నో అమూల్యమైన సలహాలిస్తున్నారు.స్వరాభిషేకంతో సంగీతాభిమానులను సమ్మోహనపరుస్తూనే ఉంది.అత్యద్భుతమైన ఆమె పాటను అక్కున చేర్చుకోని ప్రశంసించని ప్రభుత్వం లేదు, గుర్తించని కళా సంఘం లేదు. బహుమతులు, బిరుదులు, ప్రశంసా పత్రాలు, నందులు ఆ గాన కోకిల సిగలో లెక్కలేనన్ని. 

             భవిష్యత్లో కూడా ఎన్నెన్నో అద్భుతమైన తెలుగు పాటలు చిత్ర నోటి నుండి జాలు వారాలని, అవన్నీ తెలుగు పాటల తోటలో వాడనీ పూలుగా నిరంతరం పరిమళాలు పంచాలనీ తన పాటకి దాసోహమైన నా చిరు కోరిక.







List of Chitra Telugu Songs:

http://www.telugulyrics.org/Songs.aspx?Source=Singer&ID=30&Name=Chitra

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate