Sunday, February 8, 2015

కొత్త కార్డ్ ఇస్తాం..ఎక్కువ రాయితీలొస్తాయ్ అంటే నమ్మకండి

          




                 ఇటీవల క్రెడిట్(అప్పు) కార్డ్ మోసాలు మెట్రో నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డ్ మోసాలు 2 రకాలు. ఒకటి వినియోగదారుడి నుండి దొంగిలించి కొనుగోళ్ళు జరపడం. ఇక రెండో రకం మీ క్రెడిట్ కార్డ్ సమాచారం సంపాదించి అంతర్జాలం (ఆన్లైన్) లో కొనుగోళ్ళు మీ సహాయంతోనే తెలివిగా చేయడం.
                
               రెండో రకం మోసాల సంఖ్య క్రమంగా పెచ్చుమీరుతున్నాయి. ఈ రెండో రకం అంతర్జాల చోరులు మొదట ఎలాగోలా క్రెడిట్ కార్డ్ వినియోగదారుల ఫోన్ నంబరు సంపాదిస్తారు. ఆ వినియోగదారుడికి ఫోన్ చేసి మీకు బ్యాంకు వాళ్ళు కొత్త కార్డ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ కార్డ్ వాడినట్లైతే మీకు ప్రస్తుతమున్న కార్డ్ వాడకం కంటే ఎక్కువ రాయితీ(డిస్కౌంట్)లొస్తాయి. 3 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్లొస్తాయి అని చెప్తారు. ఏ మాత్రం ఆశ పడినా వినియోగదారుడి కొంప కొల్లేరయినట్టే. 

               వినియోగదారుడి అత్యాశని గమనించిన సదరు అంతర్జాల చోరుడు వెంటనే ప్రస్తుతమున్న మీ కార్డ్ ని రద్దు చేస్తేనే కొత్త కార్డ్ ఇవ్వటానికి ఆస్కారముంటుందని చెప్తాడు. రద్దు చేయడం కోసం ప్రస్తుత మీ క్రెడిట్ కార్డ్ వివరాలు 3 అంకెల రహస్య సంఖ్యని కూడా అడుగుతాడు. అన్ని వివరాలు రాబట్టిన తరువాత మీ కొత్త కార్డ్ ని యాక్టివేట్(క్రియాశీలం) చేయడం  కోసం మీ మొబైల్ కి పిన్ పంపాను. అదేంటో చెప్పండి అని అడుగుతాడు.. కార్డ్ ని యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతో వన్ టైం పాస్ వర్డ్ (నిర్దారణ పదం లేదా సంఖ్య) ని చెప్పారో ఇక అంతే..అంతర్జాల చోరుడికి కావాల్సిన సమాచారం అందించినట్టే. మీ కార్డ్ దొంగ చేతికిచ్చినట్టే! 

               కొత్త కార్డ్ ఎదైనా సరే క్రెడిట్ (అప్పు) లేదా డెబిట్ (ఖాతా కార్డ్). ఎవరికి మీ సమాచారం ఇవ్వొద్దు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. మీ కార్డ్ సమాచారం మొత్తం బ్యాంకు వారి దగ్గర ఉంటుంది కనుక కార్డ్ సంఖ్య వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది. బ్యాంకు వారైతే ఖాతాదారుడు లేక వినియోగదారుడు సరియైన వ్యక్తి అవునో కాదో తెలుసుకోవటానికి నిర్ధారించే ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. అంతర్జాల దొంగైతే సమాచారం మొత్తం సేకరించడానికి  ప్రయత్నిస్తాడు.

              ఇటువంటి మోసానికి గురైనట్లైతే తక్షణం బ్యాంకు వారికి ఫోన్ చేసి కార్డ్ ని రద్దు (బ్లాక్)చేయాలి.  తరువాత వెంటనే పోలీసులని సంప్రదించాలి. సదరు వ్యక్తి ఫొన్ నంబరు ని జాగ్రత్త గా ఉంచుకొని పోలీసులకి తెలియజేయాలి. ఆ ఎఫ్.ఐ.ఆర్ ని బ్యాంకు వారికి పంపినట్లైతే బ్యాంకు వారిపైన తగిన చర్య తీసుకొని మీ డబ్బులు తిరిగిచ్చే అవకాశం ఉంది.  

             ఇటువంటి ఫోన్ కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త.   

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate