Saturday, November 28, 2015

ఆంధ్రా ఎం.పి లూ పోరాడితే పోయేదేం లేదు!..ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు




      1956 నుండి అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఉమ్మడిగా అభివృద్ది చేసుకున్న హైదరాబాద్ అర్ధికంగా ఎంతో ఎత్తుకు ఎదిగి దేశంలో అగ్రగామి నగరంగా ఎదిగిందివిభజన తో ఆంధ్రా ప్రజలు  హైదరాబాద్ పై సర్వ హక్కుల్ని కోల్పోయారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించాల్సి వచ్చింది.


    ఆనాడు ఆంధ్రా ప్రజల వేదన, వాదన వినే నాధులే కరువయ్యారు. కలిసి కూర్చోపెట్టి చర్చించకుండా ఎటువంటి పంపకాలు సక్రమంగా జరుపకుండా హడావుడిగా, ఎటువంటి హేతు బద్ధత లేకుండా విభజన పూర్తి చేసారు. శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక పక్కనపెట్టి ఓట్లు, సీట్లు ప్రాతిపదికన తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చారు. తరువాత ఆంధ్ర ప్రజలు తమ మాట వినని కాంగ్రెస్ ని  కనుమరుగు చేసిన సంగతి తెలిసిందే


     ఐతే ఆరోజు ప్రముఖంగా ఇచ్చిన హామీలు 2. ఒకటి ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా. రెండు పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా. ఇవి ఆంధ్రా హక్కులు.  నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్య సభ లో అంధ్రా కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇప్పటికి అది కలగానే మిగిలింది. రెండో ముఖ్య హామి ఐన పోలవరానికి జాతీయ హోదా ప్రకటించారు కానీ, నిధులు మాత్రం విదల్చట్లేదు, ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పట్లేదు





      ఆంధ్రా ఎం.పీ లు ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ రెండు హామీల్లో ఏ ఒక్కటీ తదుపరి ఎన్నికల్లోపు పూర్తిగా నెరవేరకపోయినా ఆంధ్రా ప్రజల అగ్రహానికి గురికాక తప్పదు, మీ రాజకీయ జీవితానికి ముగింపు తప్పదు.  విభజన వద్దని ఆరోజు ఎలా పార్లమెంట్లో పోరాడారో, విభజన హామీల సాధనకి అలాగే పోరాడాలి. మన ఆంధ్ర ప్రదేశ్ హరితాంధ్ర గా మారాలంటే పోలవరం తప్పనిసరి. మన పిల్లలకి ఉద్యోగాలొచ్చి , మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండి దేశంలోనే అభివృద్ది  చెందిన రాష్ట్రంగా మారాలంటే ప్రత్యేక హోదా తెచ్చుకోవాల్సిందే.  





    
 ఆంధ్రా ఎం.పీ లు పార్టీలకతీతంగా ఒక్కటవ్వండి. రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజల గురించి ఆలోచించండి. ఆంధ్రా హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడండి. ఎప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తారో, ఇంకా ఎంత కాలం నానుస్తారో  తేల్చేవరకు ప్రస్తుత సమావేశాలు జరుగనీయొద్దు.  మీ వెనక 5 కోట్ల అంధ్రా ప్రజలున్నారు. ఇక పోరు బాట మొదలు పెట్టండి. 

                                 సాధనా సాద్యతే సర్వం !!!    


   

Saturday, November 21, 2015

భారత విమానయాన రంగానికి మంచి రోజులు

       



                       యువ భారత దేశం. 125 కోట్ల జనాభా. పుంజుకుంటున్న ఆర్ధిక వ్యవస్థ. ఎన్నో అవకాశాలు. రాబోయే రోజుల్లో ప్రపంచాన్నే శాసించబోయే సత్తా ఇవన్నీ మన భారతావని ప్రత్యేకతలు.

           ఎంతో కాలంగా వివిధ కారణాల వల్ల గడ్డు కాలం ఎదుర్కొన్న భారత విమానయన రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందా అంటే అవుననే చెప్పాలి. కింగ్ ఫిషర్ దివాలా తీయడం , ఆర్ధిక సంక్షోభం కారణంగా తగ్గిన ప్రయాణికుల సంఖ్య, విపరీతంగా పెరిగిన చమురు ధరలు, అంతకంతకు పెరుగుతున్న అప్పులు , వ్యాపార నష్టాలు ఇది ఒకప్పటి భారత విమానయన రంగం పరిస్థితి.

           ఐతే ప్రస్తుతం ఈ రంగం మీద కమ్ముకున్న నీలి నీడలు ఒక్కొకటిగా తొలిగిపోయి ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోడి ప్రభుత్వ సహకారం, అంతర్జాతీయం గా చమురు ధరల్లో తగ్గుదల, పురోగమిస్తున్న ఆర్ధిక వ్యవస్థ ఈ రంగాన్ని ఆదుకున్నాయి.  ఒక విమాన రంగ సంస్థ ఆదాయంలో 40 శాతం విమాన ఇంధనం కోసం వెచ్చించాలి. ప్రస్తుతం విమాన ఇంధన ధరలు గణనీయంగా తగ్గడం వలన ఈ రంగం లాభాల బాట పట్టబోతుంది.  గడచిన 3 త్రైమాసిక ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.

           అజయ్ సింగ్  తిరిగి స్పైస్ జెట్ పగ్గాలు చేపట్టడం, ఏయిర్ ఇండియా కి కొత్త సియిఓ ని నియమించడం, జెట్ ఏయిర్ వేస్ లో ఇతిహాద్ వాటా కొనుగోళ్ళు , ఇండిగో మార్కెట్ల ద్వారా నిధులు సమీకరించడం, విస్తార మరియు  ఏయిర్ ఏసియా సంస్థల ప్రవేశం, మోడి ప్రభుత్వ కొత్త విమానయన రంగ విధానాలు, క్రమంగా పెరుగుతోన్న విమాన ప్రయాణీకుల సంఖ్య, చిన్న నగరాలు మరియు పట్టణాలకు విస్తరిస్తున్న విమాన సర్వీసులు , ఏయిర్ కోస్తా వంటి ప్రాంతీయ విమాన సంస్థల ఆవిర్భావం  ఇవన్నీ ఎన్నో శుభ పరిణామాలు. స్లీపర్ రైల్ టికెట్ ధరకే సామన్యుడి విమాన ప్రయాణం త్వరలో సాధ్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి. సిద్దంగా ఉండండి!

Monday, August 3, 2015

ఇకపై తెలుగు సినిమా బాహుబలి కి ముందు బాహుబలి తరువాత

           
          


                          ఒక తెలుగు సినిమా 100 కోట్ల వసూళ్ళ స్థాయిని అందుకోవడం నిజంగా అరుదుగా జరుగుతుంది. కానీ తెలుగు సినిమా , మన భారతీయ సినిమా చరిత్రలో వసూళ్ళ సునామీ సృష్టించిన  తొలి 5 సినిమాల్లో నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తొలి 3 వారాల్లోనే 500 కోట్లు వసూలు చేసి బాలివుడ్ తారల ఒళ్ళు జలదరింపజేసి తెలుగు సినిమా ఖ్యాతిని, భారతావని తో పాటు ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన సినిమా "బాహుబలి".

                          హిందీ సినిమా చరిత్రలో ఒక డబ్బింగ్ చిత్రం 100 కోట్ల స్థాయిని అందుకోవడం బాహుబలితోనే మొదలైంది. తెలుగు సినిమాని ఇక పైన బాహుబలి కి ముందు బాహుబలి కి తరువాత అని చెప్పవచ్చు. బాహుబలి ప్రభంజనం తరువాత బాలివుడ్ నిర్మాతలు, దర్శకులు  దక్షిణాది మార్కెట్ ని, సినిమాలని విస్మరించబోరు. తమ చిత్రాలన్నింటిని దక్షిణాది భాషల్లో తప్పక విడుదల చేస్తారు. అలానే దక్షిణాది నిర్మాతలు, హీరోలు, దర్శకులు తమ చిత్రాలను హిందీలోకి డబ్ చేసి విడుదల చేస్తారు.  


                       బాహుబలి విజయం తెలుగు వారందరికి ఎంతో గర్వకారణం. తెలుగు సినిమాని ఎంతగానో ప్రేమించేవారందరికి రాజమౌళి ఇచ్చిన బహుమతి. ఇది మా సినిమా అని ప్రతి తెలుగు వాడు తొడగొట్టి, తల ఎత్తుకు తిరిగేలా చేసిన బాహుబలి బృందానికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు.  

Sunday, February 8, 2015

కొత్త కార్డ్ ఇస్తాం..ఎక్కువ రాయితీలొస్తాయ్ అంటే నమ్మకండి

          




                 ఇటీవల క్రెడిట్(అప్పు) కార్డ్ మోసాలు మెట్రో నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డ్ మోసాలు 2 రకాలు. ఒకటి వినియోగదారుడి నుండి దొంగిలించి కొనుగోళ్ళు జరపడం. ఇక రెండో రకం మీ క్రెడిట్ కార్డ్ సమాచారం సంపాదించి అంతర్జాలం (ఆన్లైన్) లో కొనుగోళ్ళు మీ సహాయంతోనే తెలివిగా చేయడం.
                
               రెండో రకం మోసాల సంఖ్య క్రమంగా పెచ్చుమీరుతున్నాయి. ఈ రెండో రకం అంతర్జాల చోరులు మొదట ఎలాగోలా క్రెడిట్ కార్డ్ వినియోగదారుల ఫోన్ నంబరు సంపాదిస్తారు. ఆ వినియోగదారుడికి ఫోన్ చేసి మీకు బ్యాంకు వాళ్ళు కొత్త కార్డ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ కార్డ్ వాడినట్లైతే మీకు ప్రస్తుతమున్న కార్డ్ వాడకం కంటే ఎక్కువ రాయితీ(డిస్కౌంట్)లొస్తాయి. 3 రెట్లు ఎక్కువ రివార్డ్ పాయింట్లొస్తాయి అని చెప్తారు. ఏ మాత్రం ఆశ పడినా వినియోగదారుడి కొంప కొల్లేరయినట్టే. 

               వినియోగదారుడి అత్యాశని గమనించిన సదరు అంతర్జాల చోరుడు వెంటనే ప్రస్తుతమున్న మీ కార్డ్ ని రద్దు చేస్తేనే కొత్త కార్డ్ ఇవ్వటానికి ఆస్కారముంటుందని చెప్తాడు. రద్దు చేయడం కోసం ప్రస్తుత మీ క్రెడిట్ కార్డ్ వివరాలు 3 అంకెల రహస్య సంఖ్యని కూడా అడుగుతాడు. అన్ని వివరాలు రాబట్టిన తరువాత మీ కొత్త కార్డ్ ని యాక్టివేట్(క్రియాశీలం) చేయడం  కోసం మీ మొబైల్ కి పిన్ పంపాను. అదేంటో చెప్పండి అని అడుగుతాడు.. కార్డ్ ని యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతో వన్ టైం పాస్ వర్డ్ (నిర్దారణ పదం లేదా సంఖ్య) ని చెప్పారో ఇక అంతే..అంతర్జాల చోరుడికి కావాల్సిన సమాచారం అందించినట్టే. మీ కార్డ్ దొంగ చేతికిచ్చినట్టే! 

               కొత్త కార్డ్ ఎదైనా సరే క్రెడిట్ (అప్పు) లేదా డెబిట్ (ఖాతా కార్డ్). ఎవరికి మీ సమాచారం ఇవ్వొద్దు. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. మీ కార్డ్ సమాచారం మొత్తం బ్యాంకు వారి దగ్గర ఉంటుంది కనుక కార్డ్ సంఖ్య వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది. బ్యాంకు వారైతే ఖాతాదారుడు లేక వినియోగదారుడు సరియైన వ్యక్తి అవునో కాదో తెలుసుకోవటానికి నిర్ధారించే ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. అంతర్జాల దొంగైతే సమాచారం మొత్తం సేకరించడానికి  ప్రయత్నిస్తాడు.

              ఇటువంటి మోసానికి గురైనట్లైతే తక్షణం బ్యాంకు వారికి ఫోన్ చేసి కార్డ్ ని రద్దు (బ్లాక్)చేయాలి.  తరువాత వెంటనే పోలీసులని సంప్రదించాలి. సదరు వ్యక్తి ఫొన్ నంబరు ని జాగ్రత్త గా ఉంచుకొని పోలీసులకి తెలియజేయాలి. ఆ ఎఫ్.ఐ.ఆర్ ని బ్యాంకు వారికి పంపినట్లైతే బ్యాంకు వారిపైన తగిన చర్య తీసుకొని మీ డబ్బులు తిరిగిచ్చే అవకాశం ఉంది.  

             ఇటువంటి ఫోన్ కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త.   

India in Modi Rule 2014-24

Translate