Saturday, October 1, 2016

శభాష్ భారత సైన్యం






         గతంలో భారత దేశం పైన ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కొన్ని రోజుల పాటు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ని నిందించడం, ఆరోపణలు చేయడం తప్ప ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడేది కాదు. ఈ సారి భారత్ తన పంధా మార్చింది. దాయాదిని ఏమార్చింది. బదులు తీర్చుకుంది. పాకిస్తాన్ కి తక్షణ సమాధానం పంపి ఇక పై భారత్ గతంలో లా చూస్తూ కుర్చోదని తెలియజేసింది.

          ఇది బలమైన ప్రభుత్వం దేశంలో ఎన్నికయినప్పుడు చేయగల్గిన సాహసం. ఇది ఒక్క దేశం కూడా భారత్ ని పాకిస్తాన్ పై మెరుపు దాడి తరువాత నిందించకుండా నెరిపిన దౌత్యం. ఇది మాటలతో విననప్పుడు చేతలలో చేసి చూపించడం. ఇది అంతర్జాతీయ యవనిక పై క్రీయాశీలక పాత్ర పోషించి ప్రత్యర్ధి దేశాన్ని, వారి ఉగ్రవాద సహకార నైజాన్ని ఎండకట్టి ఏకాకిని చేయడం.

          సగటు భారతీయుడు ఇలాంటి బలమైన ప్రభుత్వాన్ని అప్పుడెప్పుడో ఇందిరా గాంధి హయాంలో, తరువాత వాజ్ పేయి ఇప్పుడు మోడి ద్వారా మాత్రమే చవి చూసారు. ఉరి ఘటన తరువాత సైన్యంలో ఆత్మ స్థైర్యాన్ని , భారతీయుడి మదిలో ధైర్యాన్ని, యువతలో ఉత్సాహాన్ని , ప్రతి పక్షాలను ఏకతాటి పైకి తెచ్చింది వాస్థవాధీన రేఖ వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం తన మెరుపు దాడులతో  విరుచుకుపడిన సందర్భం.

          మోడి ప్రధాని గా భారత్ అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించడం , ఉగ్ర వాద చర్యలకు చాకచక్యంగా బదులివ్వడం , అంతర్జాతీయంగా భారత దేశాన్ని రానున్న రోజుల్లో సూపర్ పవర్ గా నిలుపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

          శభాష్ మోడి, సెల్యుట్ ఇండియన్ ఆర్మి. మేమంతా మీ వెంటే.



Sunday, September 11, 2016

ఇచ్చింది తీసుకోండి..రావాల్సిన వాటి కోసం పోరాడండి



               
  ప్రత్యేక హోదా ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం హోదాను నిరాకరించి ప్రత్యేక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఐతే ప్రత్యేక హోదా తో పాటు, విభజన చట్టంలో ని అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది.

                సెప్టెంబర్ 8, 2016 న కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని కొన్ని అంశాలపై మరింత స్పష్టత నిచ్చింది కాని ప్రత్యేక హోదా ఊసు మాత్రం ఎత్తలేదు. ఐతే ప్రస్తుత సందర్భంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించడం కంటే రాష్ట్ర ఎదుగుదలకు అవసరమయ్యే అన్ని రకాల సాయాలను స్వీకరించడం మంచిది. 

                ఆంధ్ర రాష్ట్రానికి సెప్టెంబర్ 8, 2016 న ప్రకటించిన సాయం నామ మాత్రమే. ఈ కింది అంశాల పైన అంధ్రా నేతలు పోరాడాలి.

          1. రాజధాని డి.పి.ఆర్ తయారైన వెంటనే నిర్మాణానికి మరిన్ని నిధుల కోసం పోరాడాలి.
          2. పోలవరం నిర్మాణానికి మాత్రమే కాకుండా, పునరావాసానికి కూడా కేంద్రమే నిధులు భరించేలా న్యాయ పరమైన హామీ కేంద్రం నుండి లభించే వరకు ఒత్తిడి తేవాలి.

          3. దుగ్గరాజ పట్నం భారీ ఓడ రేవుని కేంద్రం నిర్మించి నిర్వహించేటట్లు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.

          4. ప్రస్తుతమిచ్చిన పన్ను రాయితీలు ఏ మాత్రం కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి సరిపోవు కనుక మరిన్ని విలువైన పన్ను రాయితీల కోసం పార్లమెంట్ లో ఎం.పి లు అందరు పోరాడాలి.

          5. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు పై కేంద్రాన్ని నిలదీయాలి. 

          6. ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర విద్యా సంస్థల సొంత భవనాలకై మరిన్ని నిధులు విదుదల అయ్యేలా, సకాలానికి పనులు పూర్తయ్యేలా జాగ్రత్త వహించాలి.  

         7. విజయవాడ, విశాఖ, తిరుపతి  మెట్రో రవాణ వ్యవస్థలకు కేంద్ర నిధులు సాధించాలి.

Saturday, July 9, 2016

నాకు నచ్చిన వాక్యాలు / సంభాషణలు !







  • క్షణం విలువ తెలియాలంటే త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వాడిని అడగాలంట. నిమిషం విలువ తెలియాలంటే- చుస్తూండగానే రైలు తప్పిపోయిన వాడిని అడగాలి. గంట విలువ తెలియాలంటే ఎవరి కోసమో నిరీక్షించేవారిని, రోజు విలువ తెలియాలంటే ఆకలితో గడిపిన వాడిని అడగాలంటారు.వారం విలువ తెలియాలంటే బంధువుల ఇంట్లో గడిపిన వాళ్ళను అడగాలట. నెల విలువ తెలియాలంటే జీతం అందుకున్న ఉద్యోగిని, సంవత్సరం విలువ తెలియాలంటే - కష్టపడి చదివినా ఏదో కారణాల వల్ల  పరీక్ష తప్పిన విద్యార్ధిని అడిగితే కచ్చితంగా చెప్తారంటారు అనుభవజ్ఞులు .

పిండంలో జన్యు పరమైన లోపాలను ముందుగా గుర్తించే టెస్ట్ లు:




                గర్భిణి మహిళల్లో పిండం ఎదుగుదల గుర్తించేందుకు సాధారణంగా ప్రతి 3 మాసాలకు ఒక త్రైమాసిక ( ట్రైమిస్టర్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. మొదటి త్రైమాసిక పరీక్షలో కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో పరిశీలిస్తారు. ఎవైనా శరీర భాగాలలో ఎదుగుదుల లోపం ఉన్నట్లైతే వాటికి జన్యు పరమైన లోపాలు కారణమయ్యే అవకాశం ఉంది.
        అలాంటి జన్యుపరమైన లోపాలను తొలిదశ లోనే గుర్తించేందుకు 2 టెస్ట్ లు చేయించుకోవాలని గైనకాలజిస్ట్ లు చెప్తారు. 1. ఆమ్నియోసింతెసిస్ 2. ఫిష్ టెస్ట్ లు. ఇవి కొంచెం ఖర్చుతో కూడిన టెస్ట్ లు. హాస్పిటల్ ని బట్టి వీటికయ్యే ఖర్చు 15- 20 వేల మధ్య ఉండొచ్చు.

         ఆమ్నియోసింతెసిస్ ఫలితాలు రావడానికి 4 వారాలు పడుతుంది. ఫిష్ టెస్ట్ ఫలితాలు ఒక వారంలో వస్తాయి.  రెండు టెస్ట్ ల కోసం పిండం లో ఉండే ఉమ్ము నీరు సేకరిస్తారు. జన్యు పరమైన ఇబ్బందులనుండి పుట్టబోయే బిడ్డని కాపాడడం కోసం ముఖ్యంగా డౌన్ సిండ్రోం సమస్యలు నివారించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.    

         పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లీదండ్రులు ఆశిస్తారు. ఈ టెస్ట్ ల గురించి నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్ ల సలహా మేరకు ప్రతి గర్భిణి నడుచుకుంటే అంతా మంచే జరుగుతుంది. శుభం భుయాత్.








         
మరింత సమాచారం కోసం కొన్ని లింక్స్: 
        

http://www.cyh.com/HealthTopics/HealthTopicDetails.aspx?p=438&np=459&id=2765

http://www.webmd.com/baby/amniocentesis

http://www.advancedwomensimaging.com.au/prenatal-diagnostic-testing





Saturday, July 2, 2016

విశ్వ నగరం సంగతి దేవుడెరుగు..రోడ్ల సంగతేంటి? కరెంట్ కి నిలకడేది?

       




           పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత మన హైదరాబాద్ కి కరెక్ట్ గా సరిపోతుంది. చెప్పుకోవడానికేమో హైటెక్ సిటి. రోడ్లు  పూర్తిగా బురద మయం.  ఒక పక్క వర్షాలు , మరో పక్క మెట్రో పనులు , ఇంకొక వైపు మంజీర మరియు క్రిష్ణా పైపు లైను పనులు వెరసి హైదరాబాద్ రోడ్లని  బురదమయం చేశాయి.

          బోరబండ బస్తీ ఐనా, హైటెక్ సిటి పరిసరాలైనా రోడ్లు మాత్రం ఒకటే రకం. కొద్ది దూరాల ప్రయాణీకులు సైతం గంటల తరబడి ట్రాఫిక్ లో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక దూరప్రయాణికుల కష్టాలకు అంతే లేదు. పట్టించుకునే నాధుడు లేడు, స్పందించి తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం మచ్చుకైనా కానరాదు. హైదరాబాదు లొ ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు , విద్యార్ధులు వర్గం ఎదైనా సమస్య ఒక్కటే. ట్రాఫిక్ చిక్కులు. అధ్వాన్న రోడ్లు.

          గత 6 నెలలుగా ప్రస్తుత ప్రభుత్వం 24 గంటలు కరెంట్ సరఫరా అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ హైదరాబాద్ లో పరిస్థితి వేరేలా ఉంది. ముఖ్యంగా .టి హబ్ పరిసరాలైన గచ్చి బౌలి, హైటెక్ సిటి, కొండా పూర్, నానక్ రాం గూడ, మాదాపుర్ పరిసరాల్లో ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలీని పరిస్థితి. ఒక గంటలొ పది సార్లు కరెంట్ పోయి, వచ్చే పరిస్థితి. కరెంట్ ఆటలకు చెల్లు ఎప్పుడు?

          గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎవైతే వాగ్ధానాలు చేసారో అవి అన్ని అమలు చేయాలి. హైదరాబాద్ ప్రజల గోడు పట్టించుకోండి. విశ్వ నగరం ఊహాలోకం నుండి బయటకొచ్చి వాస్తవ పరిస్థితులను చక్క దిద్దండి


Tuesday, April 19, 2016

పెళ్ళి సంబంధాలు వెతికే యువతీ, యువకుల కోసం మాత్రమే -2 !







మ్యాట్రిమొని లో ప్రొఫైల్ ( వ్యక్తిగత వివరాలు) పొందుపర్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

        మీ అబ్బాయి, అమ్మాయి పెళ్ళి చేద్దాం అనుకున్నప్పుడు ఈరోజుల్లో తెలిసిన వాళ్ళకి చెప్పడానికి లేదా బాహ్య ప్రపంచానికి తెలపడానికి మ్యాట్రిమొని లో వారి వివరాలతో ఖాతా ( ఎకౌంట్) ప్రారంభించడమే ఏకైక సాధనం. పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టినప్పటినుండి ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి మ్యాట్రిమొని ఐ.డి నే ఆధార్ నంబరు.ఆధార్ ఐ.డి ఉంటే అన్ని ప్రభుత్వ సేవలకి ఎలా అర్హత లభిస్తుందో, మ్యాటిమొని ఐ.డి ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా మీగురించి తెలుసుకోవచ్చు, నచ్చితే సంబంధం కలుపుకోవచ్చు.   టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఖాతా ప్రారంభించిన మరు క్షణమే మనసు తనకు సరైన జోడి కోసం మ్యాట్రిమొనిలో వెతుకులాట (సర్చ్) మొదలెడుతుంది.

           పల్లెటూరి అందం సైతం సిలికాన్ వ్యాలి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించొచ్చు. సాదా సీదాగా ఉండే పేదింటి కుర్రాడు పెద్దింటి పిల్ల మనసులో వలపు సైరన్ మోగించొచ్చు. తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్లుగా తమ కుటుంబానికి సరితూగే సంబంధం కొద్ది రోజుల్లోనే కుదొరొచ్చు. డాక్టర్కి తోడుగా మరో డాక్టర్ని , ఉద్యోగినికి జోడీగా మరో ఉద్యోగస్తుడ్ని , వ్యాపారస్తుడ్ని  తనని అర్ధం చేసుకునే అర్ధాంగినీ ఏకం చేసే సత్తా మ్యాట్రిమొని సైటులకి ఉంది.          

           ఖాతా తెరచిన తొలినాళ్ళలో అమ్మాయైతే అందగాడైన అబ్బాయిల ప్రొఫైల్ చుట్టూ, అబ్బాయైతే అందమైన భామ ల ప్రొఫైల్ చుట్టూ మనసు అలుపెరుగక పరిగెడుతుంటుంది. కొంత కాలానికి గాని వయసుకి బోధపడదు, అందం అందనంత దూరంలో ఉంటుందని, అంత సులువుగా అందదని, మెరిసేదంతా బంగారం కాదని ,అనుకున్నట్లుగా అన్నీ జరగవనీ, గాలిలో మేడలు కట్టడం వృధా అని,  దూరం నుండి కలుస్తున్నట్టుగా కనిపించే ఆకాశం భూమి ఎప్పటికీ కలుసుకోవనీ, మంచి సంబంధం దొరకాలంటే ఖాతా ప్రారంభిస్తే సరిపోదని మన వంతుగా కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదని తెలిసి వస్తుంది. 

            అదేదో సినిమాలో త్రివిక్రం చెప్పినట్టుగా పరీక్ష కోసం అందరూ చదువుతారు కానీ పరీక్షలో అన్ని గుర్తు పెట్టుకొనీ అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు రాసినవాడే విజయం సాదిస్తాడు. ప్రొఫైల్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేస్తారు కానీ అందులో ఎంతమంది తమ వివరాలను సరిగా , నిజాయితీగా తెలియజేస్తారు? ఎంతో ప్రాముఖ్యమున్న మ్యాట్రిమొని ప్రొఫైల్ని సరిగా నింపి పెళ్ళి చూపుల ఎగ్జాం (నెక్స్ట్ లెవల్)కి ఎలా అర్హత సాదించాలి? తమ ప్రొఫైల్ చూసిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ పాజిటివ్ గా కలగడానికి ఏం చేయాలి?  ఈ కింది సలహాలు పాటిస్తే చాలు.  

1. ప్రొఫైల్ ప్రారంభించిన వెంటనే రీసెంట్ ఫోటో జత చేయాలి.
2. ప్రొఫైల్లో అడిగిన అన్ని వివరాలని స్పష్టంగా తెలియజేయాలి.
3. ఇచ్చే ప్రొఫైల్ సమాచారమంతా 100 శాతం ఖచ్చితత్వాన్ని  ప్రతిబింబించాలి.
4. తల్లిదండ్రుల పేర్లు, వారి వ్యాపార ఉద్యోగ సంబంధిత విషయాలు, అన్నా చెల్లెళ్ళు లెదా అక్కా తమ్ములెంతమందో ఉంటే కనుక తెలియజేయాలి.  ప్రస్తుతం వారెం చేస్తున్నారొ మెన్షన్ చేస్తే ఇంకా మంచిది.
5. ప్రొఫైల్ అల్బం లో మీకు మీరుగా చాలా అందంగా ఉన్నాను అనిపించిన ఫోటొలని మాత్రమే ఉంచండి. 3 లేదా 4 చక్కని ఫోటో లు ( ఒకటి ఫుల్, ఒకటి హాఫ్, మరోటి ట్రెడిషనల్ , ఇంకొకటి ట్రెండీ ) ఉంచితే మంచిది. గౌరవ ప్రదమైన దుస్తుల్లో దిగిన ఫోటోలకే ప్రాధాన్యం ఇవ్వండి. 

6. పుట్టిన తేది( సర్టిఫికట్ ప్రకారం), ఉద్యోగం వివరాలు( కంపెనీ, రోల్,చిరునామా)  , జీతం (సంపాదిస్తునట్లైతే)  అత్యత ఖచితత్వం తో పొందు పర్చాలి.
7. ఫొటొ అల్బం లో సెల్ఫీ లు ఉంచకండి. ఫోటో షాప్ లేదా ఎడిటింగ్ లెదా స్టూడియో లో దిగిన ఫోటో ల కంటే సహజంగా ఉండే ఫోటో లకి మాత్రమే పెద్ద పీట వేయండి.
8. అబ్బాయిలైతే తనకి కాబోయే ఇల్లాలు ఇంటి పట్టున ఉండాలా లేక ఉద్యోగం చేయాలాని ఆశిస్తున్నారో తప్పక తెలపాలి. అమ్మాయిలైతే విదేశాల్లో ఉద్యోగం చేసే వారికోసం  వెతుకుతున్నట్లైతే తప్పక ఆ విషయం మీ ప్రొఫైల్ లో యాడ్ చేయండి. 
9. అమ్మాయిలైతే మీ కలల రాకుమారుడు ఎలా ఉండాలో , అబ్బాయిలైతే మీ స్వప్న సుందరి నుండి ఏవేం ఆశిస్తున్నారో మీ భావాల్లో తప్పక వ్యక్త పరచండి.
10. త్వరగా పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉచిత సభ్యత్వం కాకుండా డబ్బులు కట్టి సభ్యత్వం తీసుకున్నట్లైతే ఎక్కువమంది ఇంట్రస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు త్వరగా ఒక ఇంటివారవడానికి నిజాయితిగా భాగస్వామి కోసం అన్వేషిస్తున్నారని ఇతరులకి తెలియజేసినట్లుగా ఉంటుంది.      

11. రిఫెరెన్స్ వివరాలు పొందు పర్చడం మీ ప్రొఫైల్ కి అదనపు బలం.

12. మీ గురించి మీ మాటల్లో వైవిధ్యంగా ( ఇన్నొవేటివ్), ఆకర్షించేలా  నాలుగైదు వాక్యాల్లో వ్యక్తపరచడం ద్వారా మీ ప్రొఫైల్ని ఎక్కువమందికి చేరువ చేయొచ్చు.

13. మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని (రిచ్, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ) తప్పక మెన్షన్ చేయండి.

14. గ్రాడ్యుయేషన్,  పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజిల వివరాలు , స్పెషలైజేషన్ వివరాలు రాయడం మర్చిపోవద్దు.

15. కాంటాక్ట్ నంబరు అన్ని వేళల్లో అందుబాటులో ఉండే నంబరు ఉంచాలి. తల్లిదండ్రుల నంబర్లైతే మీ వేట మరింత సులభమవుతుంది.

16. ఎవరైనా ఇంట్రస్ట్ చూపించినట్లైతే  మీకు ఇష్టమో లేదో ఒక వారం రోజుల్లో తప్పక రిప్లై ఇవ్వండి. ఈలోగా మీ తరపున విచారణ ( ఎంక్వైరి) పూర్తి చేసుకోండి.

17. సామాజిక అనుబంధాల సైట్లలో (ఫేస్ బుక్/ట్విట్టర్/ లింక్డ్ ఇన్)  మీ పేరు ఎలా ఉంటుందో అలానే ఇస్తే ప్రొఫైల్ నిజమా కాదా అనే సందేహం ఎదుటివారికి దూరం చేసినట్లవుతుంది.

18. మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొన్నట్లైతే వెంటనే స్పందించే అవకాశం లభిస్తుంది. 

19. ఎకౌంట్ క్రియేట్ చేసి వదిలేయకుండా వారానికొకసారి ప్రొఫైల్లో మీ సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉండండి ( కొత్త ఫోటోలు లేక మీ గురించి కొత్త విషయాలు).

20.   రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ( పెయ్డ్ మెంబర్స్)  వారికి నచ్చిన వారిని వెంటనే సంప్రదించే సదుపాయాలుంటాయి. అంతే కాదు ఒక రోజులో వారి ప్రొఫైల్ని ఎవరెవరు చూసారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఎవరైనా మీ ప్రొఫైల్ ని పదే పదే విజిట్ చేసినట్లైతే వారు మీ గురించి తప్పక ఆలోచిస్తున్నారనే అర్ధం కనుక వారిని మీరు కూడా ఇష్టపడుతున్నట్లైతే తక్షణమే సంప్రదించండి (కాంటాక్ట్ చేయండి).    

21. అలాగే నచ్చిన వారికి రిక్వెస్ట్ పెట్టి వదిలేయకుండా వారికి మరలా గుర్తు చేస్తూ ఉండండి (ఫాలో అప్). తద్వారా మీరు రిక్వెస్ట్ పంపిన వారితో సంబంధం కోసం  ఎంతో ఆసక్తి తో ఉన్నారని అవతలి వారికి అవగతమవుతుంది.  



 ఐ విష్ యు అల్ ద బెస్ట్.  ఇక కుమ్మేయండి. విజయం మీ సొంతమే. 

           !!!  శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు  !!!

Sunday, April 10, 2016

పెళ్ళి సంబంధాలు వెతికే యువతీ, యువకుల కోసం మాత్రమే -1 !

                 


                    నాకు తెలుసు ఈరొజుల్లో మంచి వధువు కోసం అబ్బాయిలూ వారి తల్లిదండ్రులు పడే ఆరాటం. మనందరికి తెలుసు తమ కన్న కూతుర్ని ఒక చక్కని వరుడి చేతిలో పెట్టి ఒక ఉన్నత  కుటుంబానికి కోడలుగా పంపాలని అమ్మాయి తల్లిదండ్రులు పడే తాపత్రయం. 

             ఒకప్పుడు అమ్మాయి పెళ్ళంటే వారి తల్లిదండ్రులు ఎంతో శ్రమించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. కొంచెం అటు ఇటుగ ఉన్న అమ్మాయి వివాహం కోసం స్వయంవరం నిర్వహిస్తే ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ పాల్గొనడానికి సిద్దంగా ఉన్న యువకులెందరో. కాస్త చదువు, కొంచెం అందం ఉంటే చాలు తమ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేసుకుంటాం ప్రభో అని పిల్ల తల్లిదండ్రుల ఇళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసేవారు ఈరోజుల్లో కోకొల్లలు. ఇక అందమైన అమ్మాయి దక్కలాంటే అదృష్టంతో పాటు ఆస్తి పాస్తులు కావాల్సిందే, మంచి ఉద్యోగం ఉండాల్సిందే! గడచిన కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్న భ్రూణ హత్యల ఫలితంగా తరుగుతున్న అమ్మాయిల సంఖ్య ఈ డిమాండ్ కి ఒక కారణమా లేక కొంతమంది అమ్మాయి తల్లిదండ్రుల్లో గూడు కట్టుకున్న అత్యాశా లేక వేలల్లో ఎందుకు లక్షల్లో ఒక్కడ్ని ఎంచుకో అని ఊదరగొడుతున్న మ్యాట్రిమొని ప్రకటనల పుణ్యమో తెలీదు కాని వరుడవ్వాలనే యువకుడికి మాత్రం ఎన్నో కష్టాలు.     

              అబ్బాయి గుణగణాలకు కాలం చెల్లిన ఈరోజుల్లో సంపాదనే అన్నిటికంటే ఎక్కువగా అమ్మాయి తల్లిదండ్రులని ఆకర్షించే అంశమై కూర్చుంది. వ్యాపారస్తుల కంటే ఉద్యోగస్తులకు ఎక్కువ ప్రాధాన్యం,  ఉద్యోగుల్లో కుడా సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళకు మరింత ప్రాధాన్యం, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారంటే అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం అమ్మాయి తల్లిదండ్రులకు నేడు సర్వ సాధారణం.  పేరుకి టీచర్, లెక్చరర్ గౌరవ ప్రదమైన ఉద్యోగాలైనా ఎంతోమంది అమ్మాయి తల్లిదండ్రుల దృష్టిలో అవి విలువైన ఉద్యోగాలు కానట్టే. ఇలా చెప్పుకుంటూపోతే వారి కోర్కెలకు అంతే లేదు.    

              అమ్మాయి తల్లిదండ్రుల ఆశలకు సరితూగేవారు, వారి అంచనాలు అందుకునేవారు చాలా కొద్ది మంది యువకులే. ఇప్పటివరకు ఉద్యోగం సంపాదించడమే జీవితంలో చాలా కష్టం అనుకునేవారు అబ్బాయిలు, కాని ఇప్పుడు తమ వివాహానికి సరైన వధువు కోసం అన్వేషించడం అన్నిటికంటే కష్టమని తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు 20 లలో ఇంటివారయ్యే యువకులు ఇప్పుడు 20 లలో తమ జీవిత భాగస్వామికై వేట మొదలెట్టినా 30 లలో మాత్రమే ఇంటివారవుతున్నారు. 

              ఈ సమస్యకు కారణాలేంటి ? తప్పెవరిది? అమ్మాయిదా లేక వారి తల్లిదండ్రులదా ?  అబ్బాయిలదా లేక వారి జీవన శైలా? మంచి సంబంధం దొరకాలంటే ఎవరేం చేయాలి ? వివాహం విషయాల్లో మ్యాట్రిమొని పాత్రెంత?  నా అనుభవాలని మీతో త్వరలో పంచుకోబోతున్నను..ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీలో ఒకడినే...మీలాగే వధువునెంచుకునే సమయంలో నిద్ర లేని రాత్రులు గడిపినవాడినే!              


Saturday, March 5, 2016

విజయవాడ బస్ స్టాండ్ కి కొత్త రూపు

     


                   

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారికంగా అమరావతి రాజధాని అయినప్పటికీ అనధికార రాజధాని మాత్రం ప్రస్తుతానికి విజయవాడ అన్నది అందరికి తెలిసిందే. ఎంతో ప్రాముఖ్యమున్న విజయవాడ లో సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే.

           రాష్ట్ర విభజన తరువాత ఆసియా లోనే అతి పెద్దదైన విజయవాడ బస్ స్టేషన్ కి మహర్దశ పట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పలు చర్యలు తీసుకొంది. వీటిలో భాగంగా నవ్యాంధ్రలో ఎంతో ఆర్ధిక, రాజకీయ ప్రాముఖ్యత కల్గిన విజయవాడ, గుంటూరు బస్ ప్రయాణికుల ప్రాంగణాల(బస్ స్టేషన్) నవీకరణ జరిగింది.

         1. అత్యాదునికమైన, విలాసవంతమైన సీటింగ్ సదుపాయాలు.
         2. డిజిటల్ తెరలపై బస్ ల రాకపోకల వివరాలు.
         3. సుశిక్షుతులైన సిబ్బందితో కూడిన ప్రయాణికుల సహాయ కేంద్రాలు ( హెల్ప్ డెస్క్).
         4. స్టేషన్ లో పారిశుధ్యం మెరుగుదలకు యంత్రాల వినియోగం.  
         5. డ్రైవర్లకు ఏ.సి. విశ్రాంత గదులు.
         6. అత్యాధునిక మూత్రశాలలు (టాయ్ లెట్స్)
         7. ప్రయాణికుల వినోదం కోసం ఎల్.సి.డి టి.వి లు.         
         8. ఎ.టి.ఎం సౌకర్యాలు.
         9. శుద్ధి చేసిన తాగు నీటి సదుపాయాలు.
         10. ఉచిత వై-ఫై సౌకర్యం.

     ఈ మార్పులన్ని ఆర్.టి.సి బస్ లను ప్రయాణీకులకు మరింత చేరువ చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మున్ముందు మరిన్ని అత్యాధునిక వసతులు కల్పించి విజయవాడ బస్ స్టేషన్ని తెలుగు రాష్ట్రాల్లొనే అత్యుత్తమమైన, ప్రయాణీకులకు అనుకూల బస్ స్టేషన్ గా నిలపడానికి అంధ్రా ఆర్.టి.సి చర్యలు తీసుకోవాలి. ప్రయాణీకులకు సౌకర్యాల కల్పన సంస్థ అదాయానికి ఎంతో సహకరిస్తుందనే విషయం అధికారులు గుర్తించాలి. పనిలో పనిగా ఈ కింది విషయాలపై ఆర్.టి.సి దృష్టి సారిస్తే మంచిది.

        1. డ్రైవర్లు,  కండక్టర్లు మరియు ఆర్.టి.సి సిబ్బంది ప్రయాణికులతో ఎలా సంభాషించాలో, ఓపికతో ఎలా సమాధానిమివ్వాలో తెలియజేయాలి. 
        2. 24 గంటల నాణ్యమైన ఆహార సదుపాయాలు ( 24/7 ఫుడ్ కోర్ట్స్)
        3. మంచి పార్కింగ్ సదుపాయాలు.
        4. 24 గంటల పోలీసుల పర్యవేక్షణ. 
        5. తక్షణ ఫిర్యాదుల పరిష్కార కేంద్రం.
        6. టోల్ ఫ్రీ నంబర్ కి వచ్చిన ఫిర్యాదులపైన తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి.
        7. పట్టణ ప్రయాణీకుడ్ని, పల్లె ప్రయాణికుడ్ని సమ దృష్టితో చూడాలి.  



       
               విజయవాడ తో పాటుగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి జిల్లాలో అత్యధిక ఆదాయం ఆర్జించే మొదటి 4 బస్ స్టేషన్లు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు (పిలిగ్రిం సిటీస్), విహార కేంద్రాలు ( టూరిజం సెంటర్) ఉన్న చోట ఇలాంటి సౌకర్యాలు తక్షణం కల్పించి ప్రయాణికుద్ని రారాజు గా చూడాలి. ఇప్పటికే బస్ స్టేషన్లు ఉన్న చోట కొత్త సదుపాయాలు కల్పించి, మరిన్ని మారుమూల ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు లేదా బస్ షెల్టర్లు నిర్మించాలి. 

ఆర్.టి.సి ఆదాయాన్ని పెంచేందుకు కొన్ని సూచనలు:

1. మొబైల్ యాప్ ద్వారా రిజర్వేషన్ టికెట్లను కోనుగోలు చేసేవారికి డిమాండ్ని బట్టి 10 % వరకు రాయితి ( డిస్కౌంట్) ఇవ్వాలి.
2. ముఖ్యంగా హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు కనీసం రోజుకొక సర్వీస్ నడపాలి.   ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రులెందరో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధానిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి రవాణా వసతి పరంగా చేరువ చేయాల్సిన భాద్యత ఆర్.టి.సి పైన ఉంది. పండగ సమయాల్లో మరిన్ని సర్వీసులు హైదరాబాద్ నుండి నడపాలి. 

3. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు కలిపే విధంగా దగ్గరగా ఉండే ప్రాంతాలను గుర్తించి కొత్త రూట్లను సృష్టించాలి. 



విజయవాడ  బస్ స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న సినిమా
 ధియేటర్:


India in Modi Rule 2014-24

Translate