Tuesday, April 19, 2016

పెళ్ళి సంబంధాలు వెతికే యువతీ, యువకుల కోసం మాత్రమే -2 !







మ్యాట్రిమొని లో ప్రొఫైల్ ( వ్యక్తిగత వివరాలు) పొందుపర్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

        మీ అబ్బాయి, అమ్మాయి పెళ్ళి చేద్దాం అనుకున్నప్పుడు ఈరోజుల్లో తెలిసిన వాళ్ళకి చెప్పడానికి లేదా బాహ్య ప్రపంచానికి తెలపడానికి మ్యాట్రిమొని లో వారి వివరాలతో ఖాతా ( ఎకౌంట్) ప్రారంభించడమే ఏకైక సాధనం. పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టినప్పటినుండి ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి మ్యాట్రిమొని ఐ.డి నే ఆధార్ నంబరు.ఆధార్ ఐ.డి ఉంటే అన్ని ప్రభుత్వ సేవలకి ఎలా అర్హత లభిస్తుందో, మ్యాటిమొని ఐ.డి ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా మీగురించి తెలుసుకోవచ్చు, నచ్చితే సంబంధం కలుపుకోవచ్చు.   టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఖాతా ప్రారంభించిన మరు క్షణమే మనసు తనకు సరైన జోడి కోసం మ్యాట్రిమొనిలో వెతుకులాట (సర్చ్) మొదలెడుతుంది.

           పల్లెటూరి అందం సైతం సిలికాన్ వ్యాలి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించొచ్చు. సాదా సీదాగా ఉండే పేదింటి కుర్రాడు పెద్దింటి పిల్ల మనసులో వలపు సైరన్ మోగించొచ్చు. తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్లుగా తమ కుటుంబానికి సరితూగే సంబంధం కొద్ది రోజుల్లోనే కుదొరొచ్చు. డాక్టర్కి తోడుగా మరో డాక్టర్ని , ఉద్యోగినికి జోడీగా మరో ఉద్యోగస్తుడ్ని , వ్యాపారస్తుడ్ని  తనని అర్ధం చేసుకునే అర్ధాంగినీ ఏకం చేసే సత్తా మ్యాట్రిమొని సైటులకి ఉంది.          

           ఖాతా తెరచిన తొలినాళ్ళలో అమ్మాయైతే అందగాడైన అబ్బాయిల ప్రొఫైల్ చుట్టూ, అబ్బాయైతే అందమైన భామ ల ప్రొఫైల్ చుట్టూ మనసు అలుపెరుగక పరిగెడుతుంటుంది. కొంత కాలానికి గాని వయసుకి బోధపడదు, అందం అందనంత దూరంలో ఉంటుందని, అంత సులువుగా అందదని, మెరిసేదంతా బంగారం కాదని ,అనుకున్నట్లుగా అన్నీ జరగవనీ, గాలిలో మేడలు కట్టడం వృధా అని,  దూరం నుండి కలుస్తున్నట్టుగా కనిపించే ఆకాశం భూమి ఎప్పటికీ కలుసుకోవనీ, మంచి సంబంధం దొరకాలంటే ఖాతా ప్రారంభిస్తే సరిపోదని మన వంతుగా కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదని తెలిసి వస్తుంది. 

            అదేదో సినిమాలో త్రివిక్రం చెప్పినట్టుగా పరీక్ష కోసం అందరూ చదువుతారు కానీ పరీక్షలో అన్ని గుర్తు పెట్టుకొనీ అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు రాసినవాడే విజయం సాదిస్తాడు. ప్రొఫైల్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేస్తారు కానీ అందులో ఎంతమంది తమ వివరాలను సరిగా , నిజాయితీగా తెలియజేస్తారు? ఎంతో ప్రాముఖ్యమున్న మ్యాట్రిమొని ప్రొఫైల్ని సరిగా నింపి పెళ్ళి చూపుల ఎగ్జాం (నెక్స్ట్ లెవల్)కి ఎలా అర్హత సాదించాలి? తమ ప్రొఫైల్ చూసిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ పాజిటివ్ గా కలగడానికి ఏం చేయాలి?  ఈ కింది సలహాలు పాటిస్తే చాలు.  

1. ప్రొఫైల్ ప్రారంభించిన వెంటనే రీసెంట్ ఫోటో జత చేయాలి.
2. ప్రొఫైల్లో అడిగిన అన్ని వివరాలని స్పష్టంగా తెలియజేయాలి.
3. ఇచ్చే ప్రొఫైల్ సమాచారమంతా 100 శాతం ఖచ్చితత్వాన్ని  ప్రతిబింబించాలి.
4. తల్లిదండ్రుల పేర్లు, వారి వ్యాపార ఉద్యోగ సంబంధిత విషయాలు, అన్నా చెల్లెళ్ళు లెదా అక్కా తమ్ములెంతమందో ఉంటే కనుక తెలియజేయాలి.  ప్రస్తుతం వారెం చేస్తున్నారొ మెన్షన్ చేస్తే ఇంకా మంచిది.
5. ప్రొఫైల్ అల్బం లో మీకు మీరుగా చాలా అందంగా ఉన్నాను అనిపించిన ఫోటొలని మాత్రమే ఉంచండి. 3 లేదా 4 చక్కని ఫోటో లు ( ఒకటి ఫుల్, ఒకటి హాఫ్, మరోటి ట్రెడిషనల్ , ఇంకొకటి ట్రెండీ ) ఉంచితే మంచిది. గౌరవ ప్రదమైన దుస్తుల్లో దిగిన ఫోటోలకే ప్రాధాన్యం ఇవ్వండి. 

6. పుట్టిన తేది( సర్టిఫికట్ ప్రకారం), ఉద్యోగం వివరాలు( కంపెనీ, రోల్,చిరునామా)  , జీతం (సంపాదిస్తునట్లైతే)  అత్యత ఖచితత్వం తో పొందు పర్చాలి.
7. ఫొటొ అల్బం లో సెల్ఫీ లు ఉంచకండి. ఫోటో షాప్ లేదా ఎడిటింగ్ లెదా స్టూడియో లో దిగిన ఫోటో ల కంటే సహజంగా ఉండే ఫోటో లకి మాత్రమే పెద్ద పీట వేయండి.
8. అబ్బాయిలైతే తనకి కాబోయే ఇల్లాలు ఇంటి పట్టున ఉండాలా లేక ఉద్యోగం చేయాలాని ఆశిస్తున్నారో తప్పక తెలపాలి. అమ్మాయిలైతే విదేశాల్లో ఉద్యోగం చేసే వారికోసం  వెతుకుతున్నట్లైతే తప్పక ఆ విషయం మీ ప్రొఫైల్ లో యాడ్ చేయండి. 
9. అమ్మాయిలైతే మీ కలల రాకుమారుడు ఎలా ఉండాలో , అబ్బాయిలైతే మీ స్వప్న సుందరి నుండి ఏవేం ఆశిస్తున్నారో మీ భావాల్లో తప్పక వ్యక్త పరచండి.
10. త్వరగా పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉచిత సభ్యత్వం కాకుండా డబ్బులు కట్టి సభ్యత్వం తీసుకున్నట్లైతే ఎక్కువమంది ఇంట్రస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు త్వరగా ఒక ఇంటివారవడానికి నిజాయితిగా భాగస్వామి కోసం అన్వేషిస్తున్నారని ఇతరులకి తెలియజేసినట్లుగా ఉంటుంది.      

11. రిఫెరెన్స్ వివరాలు పొందు పర్చడం మీ ప్రొఫైల్ కి అదనపు బలం.

12. మీ గురించి మీ మాటల్లో వైవిధ్యంగా ( ఇన్నొవేటివ్), ఆకర్షించేలా  నాలుగైదు వాక్యాల్లో వ్యక్తపరచడం ద్వారా మీ ప్రొఫైల్ని ఎక్కువమందికి చేరువ చేయొచ్చు.

13. మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని (రిచ్, అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ) తప్పక మెన్షన్ చేయండి.

14. గ్రాడ్యుయేషన్,  పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజిల వివరాలు , స్పెషలైజేషన్ వివరాలు రాయడం మర్చిపోవద్దు.

15. కాంటాక్ట్ నంబరు అన్ని వేళల్లో అందుబాటులో ఉండే నంబరు ఉంచాలి. తల్లిదండ్రుల నంబర్లైతే మీ వేట మరింత సులభమవుతుంది.

16. ఎవరైనా ఇంట్రస్ట్ చూపించినట్లైతే  మీకు ఇష్టమో లేదో ఒక వారం రోజుల్లో తప్పక రిప్లై ఇవ్వండి. ఈలోగా మీ తరపున విచారణ ( ఎంక్వైరి) పూర్తి చేసుకోండి.

17. సామాజిక అనుబంధాల సైట్లలో (ఫేస్ బుక్/ట్విట్టర్/ లింక్డ్ ఇన్)  మీ పేరు ఎలా ఉంటుందో అలానే ఇస్తే ప్రొఫైల్ నిజమా కాదా అనే సందేహం ఎదుటివారికి దూరం చేసినట్లవుతుంది.

18. మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొన్నట్లైతే వెంటనే స్పందించే అవకాశం లభిస్తుంది. 

19. ఎకౌంట్ క్రియేట్ చేసి వదిలేయకుండా వారానికొకసారి ప్రొఫైల్లో మీ సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉండండి ( కొత్త ఫోటోలు లేక మీ గురించి కొత్త విషయాలు).

20.   రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ( పెయ్డ్ మెంబర్స్)  వారికి నచ్చిన వారిని వెంటనే సంప్రదించే సదుపాయాలుంటాయి. అంతే కాదు ఒక రోజులో వారి ప్రొఫైల్ని ఎవరెవరు చూసారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఎవరైనా మీ ప్రొఫైల్ ని పదే పదే విజిట్ చేసినట్లైతే వారు మీ గురించి తప్పక ఆలోచిస్తున్నారనే అర్ధం కనుక వారిని మీరు కూడా ఇష్టపడుతున్నట్లైతే తక్షణమే సంప్రదించండి (కాంటాక్ట్ చేయండి).    

21. అలాగే నచ్చిన వారికి రిక్వెస్ట్ పెట్టి వదిలేయకుండా వారికి మరలా గుర్తు చేస్తూ ఉండండి (ఫాలో అప్). తద్వారా మీరు రిక్వెస్ట్ పంపిన వారితో సంబంధం కోసం  ఎంతో ఆసక్తి తో ఉన్నారని అవతలి వారికి అవగతమవుతుంది.  



 ఐ విష్ యు అల్ ద బెస్ట్.  ఇక కుమ్మేయండి. విజయం మీ సొంతమే. 

           !!!  శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు  !!!

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate