Sunday, January 6, 2013

తెగించే మృగాళ్ళకు ముగింపు పలికే మార్గాలు


          సహనానికి మారుపేరైన స్త్రీ మూర్తి అసహనానికి గురైంది. వాడ వాడలా చైతన్యం రగిలింది. గృహిణులు, ఉద్యోగినులు, యువతులు, బాలికలు ఇలా యావత్ వనితా లోకం కన్నెర్ర జేసి మృగాళ్ళకిక ముగింపు పలకాలంటూ కదం తొక్కింది. మన దేశంలో నానాటికి స్త్రీలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు , ఆకృత్యాలపై ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది. జనాభాలో సగ భాగం తామే ఐనప్పటికి తమకు భద్రత కరువైందని ప్రజా ప్రతినిధులందరిని నిలదీసింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన ఈ ఆగ్రహ జ్వాల ప్రభుత్వాధినేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తేలా చేసింది.

           పుణ్య భూమి ఐన భారతావనిలో అనాదిగా స్త్రీని ఆది పరాశక్తిగా కొలుస్తున్నారు.  ఎంతో మంది పతివ్రతలకు , ధీర వనితలకు జన్మనిచ్చింది ఈ భరత భూమి. ఇంట్లో ఆడ పిల్ల జన్మిస్తే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మే  మన ఇంట అడుగుపెట్టిందని పొంగిపోయి సంబరాలు చేసుకునే సంస్కృతి మనది. పుట్టినింటి గౌరవంతో పాటు మెట్టినింటి గౌరవ మర్యాదలు కాపాడే ఆమెను సమాజంలో విష సంస్కృతికి అలవాటుపడిన కొందరు మృగాళ్ళు కబళిస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఈ వేధింపులు ?

           ఈ అన్యాయాలకు అంతం మన పాలకుల దృఢ నిశ్చయంతోనే సాధ్యమవుతుంది. అధికారమంతా మన దేశంలో మహిళామణుల 'చేతుల్లోనే' ఉంది..ఐనా భారతీయ మహిళకి రక్షణ కరువవుతుంది. అధికారమేంటి? మహిళల చేతుల్లో ఉండటమేంటి అంటారా..?  మనదేశంలోని ప్రధాన రాజకీయ కూటములైన యు.పి.ఎ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్.డి.ఎ అధ్యక్షురాలు సుష్మా స్వరాజ్ మహిళలే కదా! ఇటీవల ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనతో దేశమంతా విస్తుపోయింది.  ఆ రాష్ట్ర పీఠం పైన కూర్చొని అధికారం చెలాయిస్తున్న షీలా దీక్షిత్ కూడా వనితే మరి.

           వీళ్ళే కాదు 2014 ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వాన్ని తోలు బొమ్మలాడించే సత్తా ఉన్న తమిళనాడు , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జయ లలిత, మమతా బెనర్జీ ఆడ వారే. ప్రస్తుత యు.పి.ఎ ప్రభుత్వంలో ప్రధాన మద్దతుదారుగా ఉన్న మాయావతి మహిళే. వీరికి తోడు లోక్ సభ, రాజ్య సభల్లో వందలాది మంది మహిళా ఎం.పిలు , వివిధ రాష్ట్రాల్లో అనేకమంది మహిళా ఎం.ఎల్.ఎలు  ఉండనే ఉన్నారు. వీరందరూ కలిపి తమ పిడికిలి బిగిస్తే ఈ మృగాళ్ళ మెడలపైన ఉరి తాళ్ళు వేలాడవంటారా ?

            లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ఆమ్ల దాడులు చేసినవారికి విధించే శిక్షలు మరో మారు నాగరిక సమాజంలో ఎవరు కూడా ఆ దిశగా ఆలోచన చేసే అవకాశం లేనంత భయకరంగా ఉండాలి.

  1. 2 నెలల్లో లైంగిక వేధింపుల కేసులు పరిష్కరించి, శిక్ష ఖరారు చేసి వెంటనే అమలు చేయాలి. జిల్లాకో ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసుల విచారణకి ఏర్పాటు చేయాలి .
  2. కనీసం 30 యేళ్ళ పాటు కఠిన కారాగార శిక్ష విధించాలి.
  3. స్త్రీలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొనేవారిని చట్ట సభలు జరిగే ఎన్నికలతో పాటుగా మరే ఇతర ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి.
  4. చట్టాల్ని నేరస్తులు చుట్టాలుగా మార్చుకోకుండా ప్రస్తుతమున్న అనేక లొసుగులని తక్షణం సరి చేయాలి.
  5. స్త్రీ రక్షణకై భారత దేశ వ్యాప్తంగా ఒకటే టోల్ ఫ్రీ నంబరుతో సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలి.
  6. వివిధ రాష్ట్రాల ప్రజా రవాణా వ్యవస్థల్లో, రైళ్ళలో వీలైంత మంది మారు పోలీసులను (మఫ్టీ) నియమించాలి.
  7. మహిళా పోలిస్ స్టేషన్ల సంఖ్యను , మహిళా రక్షక భటుల సంఖ్యను పెంచాలి.
  8. తల్లిదండ్రులు తమ పిల్లలకు గోరు ముద్దల్లో నైతిక విలువలు జోడించి తినిపించాలి.

         వీలైనంత త్వరలో స్త్రీ ల రక్షణ కోసం కొత్త చట్టాలు తెచ్చి,ఉన్న చట్టాలను పదును పెట్టి ఈ మృగాళ్ళ(బరి తెగించిన మగ వాడు) అంతు చూడాలి.  
           



           

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate