Sunday, April 7, 2013

2013..ధరలవాత నామ సంవత్సరం ఎందుకంటే ?


        2013 సంవత్సరం సగటు మనిషికి బాగా గుర్తుండిపోతుందేమో! ఎందుకంటారా? సామాన్యుడిని ఉలిక్కిపడేలా చేసిన సంవత్సరమిది. కుటుంబ బడ్జెట్ ని తల క్రిందులు చేసిన ఘనత కూడా ఈ యేటిదే.

          పెట్రోల్ మరియు డీజిల్ ధరలు, రైలు ఇంకా బస్సు ప్రయాణ టికెట్ల ధరలు, విద్యుత్ చార్జీలు ఒకటేమిటి అన్నింటి ధరలు గత సంవత్సరంతో పోలిస్తే అమాంతం పైకెగసాయి.నిత్యావసరాల ధరలు చుక్కలతో సహవాసం చేస్తూ కిందికి దిగి రానంటున్నాయి. ఈ ధరల బాంబు వంటింటిని కూడా వదల్లేదు. పరిమిత సిలిండర్ల పేరుతో గ్యాస్ సిలిండర్ సంఖ్యను కుదించేసారు. కుదింపుతో ఊరుకోక అదనంగా వాడుకోవాలనుకుంటున్న సిలిండర్ ధరను కొండెక్కించారు.



           ఒక్క డీజిల్ ధర పెంచితే సామాన్యుడిపైన తీవ్ర ప్రభావం పడుతుందనేది జగమెరిగిన సత్యం. పెట్రోల్, డీజిల్ ధరలపైన నియంత్రణ ఎత్తివేసి చమురు కంపెనీ ల ఆటలో పావుగా మారిన ప్రభుత్వం నిత్యావసరాల ధరల పెరుగుదల, డీజిల్ ధరల పెరుగుదలతో ముడిపడిందన్న సంగతి మరచిపోయింది. రోడ్డెక్కితే టోల్ ట్యాక్స్ వాత, రోజు వారి సరకులపైన సర్వీస్ ట్యాక్స్, వస్త్రాలపైన వ్యాట్ ట్యాక్స్ మోత మోగిస్తున్న సర్కారు విద్యుత్ చార్జీలకు అదనంగా సర్దు బాటు చార్జీలు విధించి సామాన్యుడిని సర్దుకుపోమని చెప్తుంది.   

     వేసవిలో తాగునీరు దొరక్క పేదలు, పంటలు పండించడానికి సాగు నీరు లేక ఒకవేళ పండితే సరియైన ధర లేక రైతులు , విద్యుత్ కోతతో పరిశ్రమలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు , వృద్ధి లేక ఆర్ధిక వ్యవస్థ దిగాలుగా ఉంటే సందట్లో సడేమియా అన్నట్లుగా సర్కారు తన అమ్ముల పొదిలొని ధరల పెంపు భాణాల్ని ఒక్కొక్కటిగా సంధిస్తూ ఉంది. ఈ సారైనా కరుణించి బడ్జెట్లో రాయితీల జల్లు కురిపిస్తారని వేయి  కళ్ళతో ఎదురు చూసిన వేతన జీవికి అలాంటి వరాలు తమ నుండి ఆశించవద్దని గట్టి సందేశమే పంపింది. ఆరోగ్య ఖర్చులు , అద్దె భత్యాలు , ద్రవ్యోల్బణం పోటు , ప్రయాణ ఖర్చులు యేటికేడు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సామాన్యుడి రోదనని వినలేని , వినిపించుకోని ఈ గుడ్డి సర్కారుకి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయి.  

       సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు, అధికార పీఠంపై అనిశ్చితి, ఉగ్ర దాడులు నిరోధించడంలో వైఫల్యం, రోజుకో కొత్త స్కాం , మహిళ రక్షణలో రాజీపడటం, విదేశీ అతిధులకు మన దేశంలో రక్షణ కరువవడం, విదేశాంగ విధానంపై అస్పష్టత , నల్ల ధనం వెనక్కి తీసుకురావడంలో వైఫల్యం, ధరల పెరుగుదలని నియంత్రించలేకపోవడం , సరి ఐన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా రిటైల్ రంగంలో విదేశి  పెట్టుబడులు స్వాగతించడం, సొంత లాభాలకు సి.బి.ఐ ని వాడుకోవడం,  ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చలేకపోవడం , మతాల మధ్య మరియు ప్రాంతాల మధ్య చిచ్చు రేపడం, విదేశి పెట్టుబడుల ఆకర్షణలో తిరోగమనం, ఆర్ధిక వ్యవస్థ మందగమనం, అవినీతి మంత్రులకు మరియు అధికార్లకు అండగా ఉండి అవినీతి విష వృక్షాన్ని విస్తరించడం, సంక్షేమ పధకాలంటూ సామాన్యుల చెవిలో పూలు పెట్టడం ఇవి అన్ని యు.పి.ఎ సర్కారు మరియు కిరణ్ ప్రభుత్వం సమిష్టిగా సాధించిన ఘనతలు. ఇన్ని ఘనతలు సాధించిన ఈ రెండు ప్రభుత్వ నావలు ప్రజాగ్రహం, ప్రజల వ్యతిరేకత అనే సముద్రంలో మునిగిపోవడం ఖాయం.         

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate