Sunday, September 26, 2010

నానక్‌రాంగూడాని పట్టించుకోని RTC, GHMC

                     


      


                      వేగంగా ఐ.టి కార్యాలయాలు విస్తరిస్తున్న నానక్‌రాంగూడ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దర్గా నుండి ఖాజాగూడ, నానక్‌రాంగూడ మీదుగా విప్రో జంక్షన్ చేరాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. విప్రో, డెలాయిట్, వర్ట్యుసా, ఐ.సి.ఐ.సి.ఐ, పోలారిస్, మైక్రోసాఫ్ట్, యు.బి.యస్, క్యాప్ జెమిని ,ఇన్‌ఫోటెక్, సి.ఎ తదితర కంపెనీల ఉద్యోగులు ఎంతోమంది ఈ మార్గంలో నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ రోడ్డు ద్వారా ప్రయాణించేవారెవరైనా మన భాగ్యనగరం పేరుకే హైటెక్, రోడ్లన్నీ లోటెక్ అని నిర్ఘాంతపోయి ముక్కున వేలేసుకోవాల్సిందే.ప్రస్తుతం విప్రో జంక్షన్ నుండి నానక్‌రాంగూడ మీదుగా దాబా సిగ్నల్ వరకు ఉన్న 10 కి.మీ. రహదారిని 6 వరుసలుగా విస్తరిస్తే తప్ప ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగుల కష్టాలు తీరవు.  


                హైటెక్ సిటీని తలదన్నే రీతిలో నానక్‌రాంగూడ ఐ.టి పార్క్ అంతకంతకు వృద్ధి చెందుతున్నప్పటికీ ఎ.పి.యస్.ఆర్.టి.సి ఈ ప్రాంతానికి బస్ సర్వీసులు నడపడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఎంతోమంది ఉద్యోగులు పనిచేసే ఈ ప్రాంతం నుండి నగరంలోని ప్రధాన ప్రాంతాలను అనుసంధానించటంలో మన ఆర్.టి.సి ఘోరంగా విఫలమైంది. 


                 లింగంపల్లి, మెహిదిపట్నం డిపో అధికారుల అశ్రద్ధ  వల్ల ఆర్.టి.సి లక్షలాది  రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది. ఇదే అదనుగా ఆటోవాలాలు హవా నడిపిస్తున్నారు. నానక్‌రాంగూడ ఐ.టి పార్క్ పరిసరాల్లో 2 లక్షలమంది వరకు ఐ.టి, బి.పి.ఓ ఉద్యోగులు పనిచేస్తారనేది ఒక అంచనా. ఎంతో ముఖ్యమైన ఈ మార్గాన్ని నగరంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన మాధాపూర్, లింగంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, ఉప్పల్, బేగంపేట, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాలతో కలిపేందుకు ఆర్.టి.సి సత్వర చర్యలు తీసుకోవాలి.










                
                విప్రో జంక్షన్ నుండి ఐ.ఐ.ఐ.టి, కొత్తగూడ మీదుగా మాధాపూర్, కూకట్‌పల్లి  జె.యన్.టి.యు వెళ్ళేందుకు రోజుకు సుమారు 50000 మంది ఉద్యోగులు ఆటోలను ఆశ్రయిస్తున్నరంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గంటకొకసారి ఈ మార్గంలో ఆర్.టి.సి అరకొర సర్వీసులు తిప్పుతున్నప్పటికీ అవి రద్ది సమయాలైన ఆఫీస్ వేళల్లో ఏ మూలకు సరిపోవు. అంతర్జాతీయ సంస్థలు, ఐ.టి కేంద్రాలకు నెలవైన ఈ ప్రాంతంలో విలాసవంతమైన ఏ.సి సర్వీసులు నడపాలనే ఆలోచన ఇంతవరకు రాకపోవటం దిగ్బ్రాంతిని కలిగించే నిజం. 


                 ప్రస్తుతమున్న 118 డబ్ల్యు, 116 యన్, 216 యల్, 10 హెచ్ /డబ్ల్యు ట్రిప్పుల సంఖ్యను రద్ధీ వేళల్లో విపరీతంగా పెంచటమే కాక మరిన్ని కొత్త మార్గాలను అన్వేషించి బస్ సర్వీసులు నడపాలి. ఇప్పటికైన అధికార్లు స్పందించి ఆర్.టి.సి కి బంగారు బాతైన  ఈ మార్గంపైన తక్షణమే దృష్టి సారించాలి. 


             ఈ సమస్యకు నిధులక్కర్లేదు. కొత్త బస్సులక్కర్లేదు. గంటకు 10 పైగా బస్సులు మెహిదిపట్నం నుండి లింగంపల్లి వైపు గచ్చిబౌలి నుండి వెళతాయి. అందులో కొన్ని బస్సులని నానక్ రాం గూడా మీదుగా మళ్ళించి విప్రో, ఐ.ఐ.ఐ.టి మీదుగా లింగంపల్లి పంపితే సరిపోతుంది. 

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate