ఈ ఆధునిక జీవితంలో ఆధ్యాత్మికత మనిషికి ఎంతో అవసరం. ఉదయం లేచింది మొదలు రాత్రి
పడుకునేవరకు భవిష్యత్ పైన బెంగ, బ్రతుకు బండి ఎలా సాగించాలనే ఆలోచన మనిషిని ఉక్కిరిబిక్కిరి
చేస్తున్నాయి. జీవితంలో ఏదో ఒక ఒత్తిడి మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ఏ వ్యక్తి
సుఖంగా లేడు. ఉన్నవాడికి ఉన్నదని మానసిక ఒత్తిడి. లేని వాడికి లేదనే ఒత్తిడి. ధనం ఉంటే
దానిని కాపాడుకోవడానికి ఒత్తిడి, లేకపోతే సంపాదించడానికి ఒత్తిడి. అంతా ఒత్తిడి మయం
ఈ జీవితం.
నేటి తరం స్వల్పకాలిక సుఖాల కోసం ఆరాటపడుతున్నారు. అతి తక్కువ కాలంలో కోటీశ్వరులు
అయ్యేందుకు తహతహలాడుతున్నారు. డబ్బు జబ్బుతో సహవాసం చేస్తున్నారు. నిరాశ నిస్పృహల్లో
కూరుకుపోతున్నారు. ఒత్తిడిని జయించలేకపోతున్నారు. మనసుని సన్మార్గంలో మళ్ళించడంలో విఫలమవుతున్నారు.
ఈ అశాంతే మనిషి అడ్డ దారులు తొక్కేందుకు కారణమవుతుంది. నైతిక విలువలు మరిచేలా చేసి
అసాంఘీక కార్యక్రమాల వైపు పురిగొల్పుతుంది. వీటన్నిటి ఫలితమే నేడు సమాజంలో
విపరీతంగా పెరుగుతున్న నేర ప్రవృత్తి, ఆత్మహత్యలు, ప్రమాదాలు, విడాకులు, దోపిడీలు మరియు
దొంగతనాలు.
ఈ ఊబి నుండి తప్పించి మనిషికి ఆహ్లాదాన్ని పంచి కాసింత ఉపశమనం
కలిగించేదే భక్తి మార్గం. భక్తి మనిషిలోని మృగాన్ని మాయం చేస్తుంది. మనసుకి పగ్గాలేసి
నైతిక విలువలని కాపాడుతుంది. మానవ సంబంధాలని ఇనుమడింపజేస్తుంది. భక్తి కొండలని
సైతం పిండి చేయగల ఆశావహ దృక్పధాన్ని అలవరుస్తుంది. మంచి చెడులను విశ్లేషించే సామర్ధ్యాన్నిస్తుంది.
ధర్మ పరి రక్షణకు సోపానమవుతుంది. తల్లిదండ్రులను , గురువులను గౌరవించే సంస్కృతి
అలవరుస్తుంది. మొత్తంగా మనిషిని మనిషిలా బ్రతికేలా కావాల్సినంత ఆత్మ స్థైర్యాన్నిస్తుంది.
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపూడి నరసింహారావు గారి ప్రకారం రామాయణ,
భారతేతి ఇతిహాసాలు మనిషి న్యాయబద్ధంగా ఎలా నడవాలో , ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో
తెలియజేసే నియమావళి మాత్రమే. మన పూర్వీకులు పాటించిన అనేక ఆచారాలు శాస్త్రపరంగా
మనిషికి మంచి చేసేవే అని అనేకసార్లు నిరూపితమైనందున నేటి తరం మన సంప్రదాయాలను తప్పనిసరిగా
అనుసరించాలన్నది శ్రీమతి సంధ్యా వందనం లక్ష్మీ దేవి గారి విన్నపము.
దుర్వ్యసనాలకు బానిసైనవాడు, పర స్రీ లోలుడు, ఇంద్రియ నిగ్రహం కోల్పోయిన
వాడు, దుర్మార్గులు తప్పక శిక్షించబడతారనీ, కలియుగంలో ఐతే చేసిన పాపాలను మరింతత్వరితగతిన
అనుభవిస్తారనీ, సన్మార్గులను,దైవ చింతనతో నలుగురికి మేలు చేసేవారికి ఆ దైవమే తోడుగా
ఉంటాడనీ తన ప్రవచనాల ద్వారా పురాణాల సారాంశాన్ని తెలియజేస్తున్నారు బ్రహ్మ శ్రీ చాగంటి
కోటేశ్వరరావు గారు.
వివిధ పుణ్యక్షేత్రాల మహిమలు, గొప్పతనాన్ని వివరిస్తూ తన
జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ మహిమాన్విత క్షేత్రాలను దర్శించేలా మనిషిని మార్గనిర్దేశనం
చేస్తుంది ఈ టి.వి. తీర్థయాత్ర కార్యక్రమం. మన పురాణాలపై నేటి తరానికున్న అనేక సందేహాలను
తీరుస్తూ , సంప్రదాయాలు పాటించడంలో ఉన్న గందరగోళాన్ని తొలగించి, పూజా విధానాలపై
మరింత స్పష్టతనిస్తుంది భక్తి టి.వి. మాస,తిధి, వార,నక్షత్రాల ప్రాముఖ్యం, పండుగల
విశేషాలతో పాటుగా, కలియుగ వైకుంఠమైన తిరుమలలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష
ప్రసారం చేసి భక్తులందరికి అమితానందం కల్గిస్తుంది శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్.
నేటి యువతరం పాశ్చాత్య
సంస్కృతి పై మోజు పడకుండా , ఆధ్యాత్మికతని అలవరచుకొని మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలని
మనసారా కోరుకుంటున్నాను.
మన రామాయణ భారతాలు, వివిధ పురాణేతిహాసాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఒక్క
క్లిక్ తో తెలుసుకోవచ్చు. ఈ కింది సైట్ కి లాగిన్ ఐతే సరి.
www.srichaganti.net
No comments:
Post a Comment