Sunday, May 30, 2010

నక్సలిజాన్ని ఎదుర్కోలేమా?





63 యేళ్ళ స్వతంత్ర భారతంలో ఎన్నో సమస్యలకు ఎదురొడ్డి నిలిచాము. అభివృద్ధి సాధించాము. అగ్రగామిగా ఎదుగుతున్నాం. ఈ క్రమంలో మన దేశం ఎదుర్కోబొతున్న మరో పెను సమస్య నక్సలిజం. ఈ సమస్యనుండి దేశాన్ని రక్షించలేమా? నక్సలిజం ని అంతం చేయటానికి అంగబలంతో పాటు బుద్ధి బలం కూడా అవసరమా? ఇవే ప్రతి భారతీయుడి మదిని తొలుస్తున్న ప్రశ్నలు.

రాష్ట్రాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఈ నక్సలిజాన్ని తమ పరిధిలో లేని అంశమని చెప్తుంటే, కేంద్రమేమో ఈ సమస్యను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని చెప్తూ తప్పించుకుంటుంది. ఈ దాగుడు మూతల ఆటలో ఎంతమంది బలవ్వాలి? అభం శుభం తెలియని పసివాళ్ళ నిండు నూరేళ్ళ భవిష్యత్తు మూణ్ణాళ్ళ ముచ్చటవ్వాల్సిందేనా? వేల కుటుంబాలు తోబుట్టువులను కోల్పోయి శోకంలో మునగాల్సిందేనా? దాడి జరిగిన వెంటనే క్షణాల్లో నష్ట పరిహారం ప్రకటించి చేతులు దులుపుకునే నేటి ప్రభుత్వాలు అసలు ఆ దాడులే జరగకుండా ఉండేందుకు చర్యలు మొదలుపెట్టకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఎందుకు కాలాన్ని వృధా చేస్తుందనేది ప్రతి ఒక్కరి ఆవేదన.

21వ శతాబ్ధంలో ప్రపంచంలోనే మహత్తర శక్తిగా ఎదగాలని కలలు కనే భారత్ నక్సలిజానికి పరిష్కారం కనుక్కునే విషయంలో చెతులెత్తేసిందనే చెప్పాలి. ఉగ్రవాదులతోపాటు నక్సలిజంపైన చేసే పోరాటానికి కూడా ఒక ప్రణాళిక అవసరమని ఆలస్యంగానైనా గుర్తిస్తే మంచిది. మానవ జాతిని అంతంచేసేందుకు పుట్టిన నరరూప రాక్షసులే ఈ నక్సలైట్లేమోనని అమాయక ప్రజల సందేహం .

ఈ ఘోరాలిలాగే కొనసాగితే ఎదో ఒకరోజున తెల్ల దొరలపై పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యాన్ని ఈ తుపాకి దొరల దగ్గర తాకట్టు పెట్టాల్సివస్తుంది. తాను ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధి డబ్బుకే తప్ప ప్రజల ప్రాణానికి విలువివ్వడని తెలిసిన రోజున ప్రజాస్వామ్యానికి అర్ధమే లేదు. ప్రజల ప్రాణాలు నీటి బుడగలవుతున్నా కనీసం చీమ కుట్టినట్లైనా అనిపించని ఈ ప్రభుత్వం ఎవరికోసం? ఏం సాధించటం కోసం? పచ్చ నొటుతో, ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపడటమే కాదు వర్గ పోరాటాలతోను సతమవుతున్న నేటి ప్రభుత్వాలు నిజాయితీతో నక్సలిజానికి పరిష్కారం కనుగొనటంలో విఫలమయ్యాయి.
నక్సలిజాన్ని జాతీయ సమస్యగా గుర్తించి చర్యలు తీసుకోని పక్షంలో సామాన్యుడే సహనం కొల్పోయి బెబ్బులిలా తిరగబడతాడు. మరో మహా సంగ్రామం మొదలుపెడతాడు. ఈ ఉద్యమాన్ని ముందుకుతీసుకుపోవటానికి మరో గాంధి తప్పక ఉదయిస్తాడు.

India in Modi Rule 2014-24

Translate